హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 13 (నమస్తే తెలంగాణ): టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్, ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) ఆధ్వర్యంలో ఆన్లైన్ హ్యాకథాన్ను నిర్వహిస్తున్నది. బ్యాంకింగ్ రంగంలో నిర్దిష్ఠ వ్యాపార రంగాల కొరకు జనరేటివ్ ఏఐ సాంకేతికతను ఉపయోగించి వినూత్న పరిష్కారాలను అభివృద్ధి చేయటమే లక్ష్యంగా హ్యాకథాన్ ఏర్పాటు చేస్తున్నది. ఉత్తమ ఆలోచనలతో వచ్చిన విద్యార్థులు, డెవలపర్లు, వృత్తి నిపుణులు, స్టార్టప్ సంస్థలకు పారితోషికాన్ని అందించనుంది. ఉత్తమమైన మూడు ఆలోచనలను ఎంపిక చేసి తొలి, ద్వితీయ, తృతీయ బహుమతులుగా రూ.5 లక్షలు, రూ.3 లక్షలు, రూ. 2 లక్షలను బీవోబీ అందించనున్నది. ఈ నెల 27 వరకు ఔత్సాహికులు దరఖాస్తు చేసుకునేందుకు https: //bobhackathon.com సందర్శించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్యాంకింగ్ రంగానికి టెక్నాలజీ అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నదని బీవోబీ ఈడీ సంజయ్ ముదలియార్ అన్నారు. అందుబాటులోకి వస్తున్న నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో బీవోబీ ముందు వరుసలో ఉంటున్నదని, ఏఐ, జనరేటివ్ ఏఐతో బ్యాంకింగ్ రంగంలో సమూలమైన మార్పు లు రాబోతున్నట్లుగా స్పష్టం చేశారు.