Hyderabad | ఐటీ, ఫార్మాస్యూటికల్స్, లైఫ్ సైన్సెస్ రంగాల తర్వాత డాటా సెంటర్ల కోసం హైదరాబాద్ మహానగరం టెక్నాలజీ కంపెనీలకు సురక్షితమైన గమ్యస్థానంగా మారింది.
ముఖ్యంగా చందన్వెల్లి, ఎలికట్ట, కొత్తూరు వంటి నగర శివారు ప్రాంతాల్లో భారీ విస్తీర్ణంలో ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా డాటా సెంటర్ల ఏర్పాటులో ఆయా సంస్థలు నిమగ్నమైయ్యాయి. మెరుగైన మౌలిక వసతులను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తూ, క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులు చేపడుతుండటంతో కంపెనీలు భారీ పెట్టుబడులతో ముందుకు వస్తున్నాయి.
ఇప్పటికే మెక్రోసాఫ్ట్, అమెజాన్ కంపెనీలు భారీ డాటా సెంటర్లను తెస్తుండగా, తాజాగా కంట్రోల్ ఎస్ సైతం చందన్‌వెళ్లిలో 40 ఎకరాల్లో డాటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నది.
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 24 (నమస్తే తెలంగాణ): శరవేగంగా పెరుగుతున్న డిజిటలైజేషన్‌తో భారత్‌లో డాటా స్టోరేజీకి విపరీతమైన డిమాండ్ నెలకొన్నది. దేశ, విదేశీ కంపెనీలు డాటా సెంటర్ల కోసం అత్యంత అనుకూలమైన ప్రాంతాలను ఎంచుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఎలాంటి వాతావరణాన్నైనా తట్టుకొనే ప్రాంతాల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అనుకూలంగా ఉన్నట్టు గుర్తించాయి. దీంతో హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో డాటా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. నిజానికి ఇప్పటిదాకా ఐటీ కారిడార్‌లోని బహుళ అంతస్థుల భవనాల్లోనే డాటా సెంటర్లను ఏర్పాటు చేసిన కంపెనీలు.. ఇప్పుడు నగర శివారు ప్రాంతాలపై దృష్టి పెడుతున్నాయి. ఒకేసారి 30 నుంచి 50 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేస్తున్నారు మరి. మరోవైపు డాటా సెంటర్ల ఆవశ్యకతను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం.. దేశంలోనే తొలిసారిగా డాటా సెంటర్ పాలసీని తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే నగర శివారు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న పారిశ్రామిక వాడల్లో డాటా సెంటర్ల కోసం ప్రత్యేకంగా స్థలాలను కేటాయిస్తున్నది. అవసరమైన విద్యుత్తు, మంచినీటి సరఫరా, రోడ్డు రవాణా సౌకర్యాలనూ కల్పిస్తున్నది.
దేశీయ ఐటీ రంగంలో బెంగళూరు తర్వాత హైదరాబాద్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలోనే డాటా సెంటర్లూ క్యూ కడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా డాటా సెంటర్ పాలసీని తీసుకు రావడం కలిసొస్తున్నది. ఇక నీరు, విద్యుత్తు వంటి వనరులపరంగా డాటా సెంటర్ల ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్రం అత్యంత అనుకూలంగా ఉండటంతో దేశ, విదేశీ కంపెనీలు భారీ విస్తీర్ణంలో ఇక్కడ డాటా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. మెక్రోసాఫ్ట్, అమెజాన్ సంస్థలు ఒకేసారి రెండు, మూడు ప్రాంతాల్లో 30 నుంచి 50 ఎకరాల్లో డాటా సెంటర్లను నగర శివారు ప్రాంతాల్లోనే నిర్మిస్తున్నాయి. తాజాగా మరో కంపెనీ కంట్రోల్ ఎస్ సైతం డాటా సెంటర్‌ను నగర శివారులోని చందన్వెల్లి పారిశ్రామిక కేంద్రంలో 40 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే ఈ సంస్థ ఐటీ కారిడార్లోనే రెండు డాటా సెంటర్లను ఒక్కొక్క దాన్ని 10 మెగా వాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసి సేవలను అందిస్తున్నది. భవిష్యత్తు డిమాండ్ దృష్ట్యా సుమారు రూ.650 కోట్ల వ్యయంతో చందన్వెల్లిలో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. కాగా, ఐటీ అంటే హైదరాబాద్ మాత్రమే కాదని, తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఐటీ కార్యకలాపాలు ఉండేలా రాష్ట్ర ప్రభుత్వమే ఐటీ టవర్స్‌ను ఏర్పాటు చేసి, మౌలిక వసతులను కల్పిస్తుండటం కూడా డాటా సెంటర్ల విస్తరణకు దారితీస్తున్నది.
టెక్ కంపెనీల డిజిటల్ అవసరాలే కాకుండా ఇతర సంస్థల డిజిటల్ డాటా నిర్వహణ డిమాండ్లను తీర్చడానికి డాటా సెంటర్లే కీలకం. ముఖ్యంగా కంపెనీలు క్లౌడ్ ఆధారిత సేవలు అందించేందుకు మొగ్గు చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ నిపుణుల అవసరం పెరుగుతున్నది. ఇందుకోసం మెక్రోసాఫ్ట్ అజూర్, అమెజాన్ డబ్ల్యుఎస్ పేరుతో క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీలను ప్రత్యేకంగా రూపొందించాయి. ఇవన్నీ డాటా సెంటర్ల వినియోగం పెరగడానికి దోహదం చేస్తున్నాయి.

నిర్మాణంలో ఉన్న భారీ డాటా సెంటర్లు మైక్రోసాప్ట్ 3 ప్రాంతాల్లో (చందన్వెల్లి, కొత్తూరు, షాద్‌నగర్) అమెజాన్ 2 చోట్ల (చందన్వెల్లి, ఫార్మాసిటీ) కంట్రోల్ ఎస్ (చందన్వెల్లి)