Windsor EV | జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తన పాపులర్ ఈవీ విండ్సార్ ధరలు పెంచేసింది. అన్ని వేరియంట్లపై రూ.50 వేల చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో విండ్సార్ ఈవీ ఇంట్రడ్యూసరీ ధరలకు తెర దించింది. అలాగే ఫ్రీ-చార్జింగ్ బెనిఫిట్లకు కూడా రాంరాం చెప్పేసింది. విండ్సార్ ఈవీ కారును మార్కెట్లో ఆవిష్కరించినప్పుడే తొలి 10 వేల కార్లు / డిసెంబర్ నెలాఖరు వరకూ ఇంట్రడ్యూసరీ ధరలను జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్స్ ప్రకటించింది. 2024 డిసెంబర్ నెలాఖరుకల్లా పది వేల యూనిట్లు విక్రయించిన మైలురాయిని చేరుకుంది. తాజాగా ధరల సవరణతో జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్స్ విండ్సార్ ఈవీ కారు ధర ఎక్సైట్ వేరియంట్ రూ.13.99 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. మిడ్ లెవల్ ఎక్స్‌క్లూజివ్ ట్రిమ్ రూ.14.99లక్షలు, టాప్ స్పెక్ ఎస్సెన్స్ వేరియంట్ రూ.15.99 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది.
కాంప్లిమెంటరీ చార్జింగ్ ఆఫర్లో భాగంగా విండ్సార్ ఈవీ కార్లు తొలుత కొనుగోలు చేసిన కస్టమర్లకు ఎంజీ ఈ-హబ్ యాప్ ద్వారా ఫ్రీగా చార్జింగ్ వసతి కల్పించింది జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్. కానీ ఈ ఆఫర్‌ను ఉపసంహరిస్తున్నట్లు స్పష్టం చేసింది. తొలి విండ్సార్ ఈవీ కారు యజమానికి జీవిత కాల వారటీ అందిస్తున్నట్లు తెలిపింది. తదుపరి కొనుగోలు చేసిన వారికి ఎనిమిదేండ్లు లేదా 1.60లక్షల కి.మీ వరకూ వారంటీ అందిస్తున్నది. 38 కిలోవాట్ల బ్యాటరీతో 136 పీఎస్ విద్యుత్, 200 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. సింగిల్ చార్జింగ్‌తో 331 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. బహుళ చార్జింగ్ ఆప్షన్లకు విండ్సార్ ఈవీ కారు మద్దతుగా ఉంటుంది.
డీసీ ఫాస్ట్ చార్జింగ్ తో కేవలం 55 నిమిషాల్లో 10-80 శాతం చార్జింగ్ అవుతుంది. కన్వినియంట్ చార్జింగ్ కోసం పోర్టబుల్ చార్జర్ అండ్ ఆప్షనల్ హోం వాల్ బాక్స్ ఉంటాయి. మార్కెట్లో ఆవిష్కరించిన మూడు నెలల్లోనే 10,045 యూనిట్ల విక్రయంతో విండ్సార్ ఈవీ పాపులారిటీ సంపాదించుకుంది. గత నెలలోనే 7,516 యూనిట్లు విక్రయించింది. 2023తో పోలిస్తే 55శాతం వృద్ధి సాధించినట్లయింది. కంపెనీ మొత్తం ఈవీ కార్ల విక్రయంలో ఇది 70 శాతం పై చిలుకే.