
Facebook Vs Meta | మెటా అని కంపెనీ పేరు మార్చుకున్న సోషల్ మీడియా వేదిక ఫేస్‌బుక్‌ను వివాదాలు వెంటాడుతున్నాయి. చికాగో కేంద్రంగా పని చేస్తున్న టెక్ సంస్థ ‘మెటా కంపెనీ’ కోర్టుకెళ్లనుంది. ఫేస్బుక్ రీబ్రాండింగ్ పేరుతో తమ సంస్థ పేరును దొంగిలించిందని మెటా కంపెనీ వ్యవస్థాపకుడు నేట్ స్క్యూలిక్ ఓ ప్రకటన చేశారు. తన సంస్థ కొనుగోలు ప్రయత్నాలు విఫలం కావడంతో మీడియాను ఉపయోగించి తమ సంస్థను మాయం చేయాలని ప్రయత్నిస్తోందన్నారు.

ఫేస్బుక్ చెప్పేదానికి, చేసేదానికి తేడా ఉంటుందన్నారు. ఫేస్బుక్ లాయర్లు గత మూడు నెలలుగా తమ కంపెనీని చౌకగా అమ్మాలని తమ వెంట పడుతున్నారని స్క్యూలిక్ చెప్పారు. కానీ తాము ఫేస్బుక్ ఆఫర్‌ను తిరస్కరించామన్నారు. గత నెల 28న ఫేస్బుక్ తన పేరును మెటాగా మారుస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఫేస్బుక్ నిర్ణయంపై న్యాయ పోరాటం చేయాలని మెటాకంపెనీ నిర్ణయించుకున్నది.