Vizag Steel | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: ఆర్థిక నష్టాల్లో కొనసాగుతున్న ప్రభుత్వరంగ స్టీల్ ఉత్పత్తి సంస్థ రాష్ట్రీయా ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(వైజాగ్ స్టీల్) విక్రయ ప్రతిపాదనపై కేంద్ర సర్కార్ వెనక్కి తగ్గింది. కార్మికుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో మోదీ సర్కార్ మరో ఆఫర్‌ను తెరపైకి తీసుకొచ్చింది. ఈ వైజాగ్ స్టీల్‌ను మరో ప్రభుత్వరంగ సంస్థయైన సెయిల్‌లో విలీనం చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కించడానికి సెయిల్‌లో విలీన అంశాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా భావిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.
అలాగే వైజాగ్ స్టీల్‌కు ఉన్న 2వేల ఎకరాల భూములను సైతం ఎన్ఎండీసీకి విక్రయించడంతోపాటు సంస్థకు ఉన్న బ్యాంక్ రుణాలకు శాశ్వత పరిష్కారం సూచించబోతున్నట్లు చెప్పారు. దీంట్లో భాగంగా డీఎఫ్ఎస్ కార్యదర్శి, స్టీల్ సెక్రటరీతోపాటు బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వైజాగ్ స్టీల్‌కు అత్యధికంగా రుణం ఇచ్చింది ఎస్బీఐ కావడం విశేషం. విశాఖపట్నంలో సంస్థకు 75 లక్షల టన్నుల స్టీల్ ఉత్పత్తి కలిగిన ప్లాంట్ ఉన్నది. ఉక్కు పరిశ్రమకు సొంతంగా గనులు లేకపోవడం వల్లనే నష్టాలు వస్తున్నాయని కార్మిక సంఘాలు ప్రధానంగా ఆరోపిస్తున్నాయి.