Mercedes-Benz with Google | అనునిత్యం టెక్నాలజీలో మార్పులతో రోజురోజుకు కొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి. తేలిగ్గా డ్రైవింగ్ చేసేలా కార్ల తయారీలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో డ్రైవింగ్ ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ కీలక నిర్ణయం తీసుకున్నది. మెరుగైన నావిగేషన్ ఎక్స్పీరియన్స్ కోసం గూగుల్‌తో దీర్ఘకాలిక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు గురువారం ప్రకటించింది. ఈ ఒప్పందం వల్ల మెరుగైన నావిగేషన్‌తోపాటు తమ కార్లలో సూపర్ కంప్యూటర్ తరహా పనితీరు అందుబాటులోకి వస్తుందని మెర్సిడెస్ తెలిపింది. తద్వారా ఎలన్ మస్క్ సారధ్యంలోని టెస్లా, బిల్డ్ యువర్ డ్రీమ్స్ (బీవైడీ) కార్లతో పోటీ పడేందుకు మెర్సిడెస్-బెంజ్ సిద్ధమవుతున్నది.
తేలిగ్గా కార్లు డ్రైవింగ్ చేసేందుకు ఆటోమేటెడ్ డ్రైవింగ్ సెన్సర్లు ఏర్పాటు చేస్తున్నట్లు మెర్సిడెస్ – బెంజ్ తెలిపింది. మరోవైపు కాస్ట్లీ, మోస్ట్ పవర్ ఫుల్ సెమీ కండక్టర్లను కొనుగోలు చేయడానికి ఎన్విడియా అనే కంపెనీతో పార్టనర్ షిప్ ఒప్పందం కుదుర్చుకున్నది. ఇందుకు ప్రతిగా కార్ల సేల్స్‌లో వచ్చే ఆదాయంలో కొంత మొత్తం ఎన్వీడియా కంపెనీకి అందజేస్తుంది. మెర్సిడెస్-బెంజ్ కంపెనీకి 2020 నుంచి ఎన్వీడియా ఆటోమేటిక్ డ్రైవింగ్ సాఫ్ట్వేర్ భాగస్వామిగా ఉన్నది.
లెవెల్-3 ఆటోమేటెడ్ డ్రైవింగ్ కోసం అవసరమైన టైడార్ సెన్సార్ టెక్నాలజీ కోరుకునే కస్టమర్లు అధికంగా కొంత మొత్తం చెల్లించాలని మెర్సిడెస్-బెంజ్ సీఈఓ ఓలా క్యాలెనియస్ చెప్పారు. ఇక సెల్ఫ్-డ్రైవింగ్ కోసం అవసరమైన సెన్సర్ల తయారీ సంస్థ ల్యూమినార్ టెక్ సంస్థలో మెర్సిడెస్-బెంజ్‌కు వాటా ఉంది. బెంజ్ కార్లలో సెన్సర్ల అనుసంధానానికి పార్టనర్ షిప్ ఒప్పందం జరిగిందని ల్యూమినార్ తెలిపింది.
గూగుల్‌తో భాగస్వామ్య ఒప్పందం వల్ల ట్రాఫిక్ ఇన్ఫర్మేషన్తోపాటు ఆటోమేటిక్‌గా రీ రూటింగ్ వంటి టెక్నాలజీ టూల్స్ తమ కార్లకు అందుతాయని మెర్సిడెజ్ తెలిపింది. లెవెల్-3 అటానమస్ డ్రైవింగ్ మోడ్‌లో ఉన్నప్పుడు కారు డ్రైవర్.. యూ-ట్యూబ్ ద్వారా వినోదాన్ని పొందొచ్చునని తెలిపింది.
రోజురోజుకి అందుబాటులోకి వస్తున్న టెక్నాలజీ టూల్స్‌తో ఇప్పుడు కార్ల డ్రైవింగ్‌లో మానవ ప్రమేయం తగ్గిపోయి ఆటోమేటిక్ డ్రైవింగ్ దశకు చేరుకుంటున్నది. ఈ విభాగంలో ఎలన్ మస్క్ సారధ్యంలోని టెస్లా కంపెనీ ముందున్నది. ఈ విషయంలో పలు చైనా కంపెనీలు ఇటీవల చాలా పురోగతి సాధించాయి. ఇప్పటికే జనరల్ మోటార్స్, రెనాల్ట్, నిసాన్, ఫోర్డ్ వంటి కార్ల తయారీ సంస్థలు తమ కార్లలో గూగుల్ సర్వీసెస్ అందుబాటులోకి తెచ్చాయి. గూగుల్ మ్యాప్స్, గూగుల్ అసిస్టెంట్ తదితర అప్లికేషన్లు ఈ కార్లలో అందుబాటులో ఉన్నాయి.