Mercedes-Benz | ఇండియాలో అతిపెద్ద లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్. ఇప్పుడంతా ఆల్టర్నేటివ్ ఫ్యుయల్ వెహికల్స్.. ఈవీ, సీఎన్జీ వేరియంట్ల వైపు అందరూ మొగ్గుతున్నారు. దేశీయంగా ఎస్యూవీ కార్ల సేల్స్ తర్వాత స్థానం లగ్జరీ కార్లదే.. ఈ నేపథ్యంలో భారత్‌లో తన ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలను పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది మెర్సిడెస్-బెంజ్. వచ్చే 8-16 నెలల్లో నాలుగు కొత్త ఈవీ కార్లను భారత్ మార్కెట్లో ఆవిష్కరించాలని తలపెట్టింది. 2027 నాటికి దేశీయ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో 25 శాతం సేల్స్ తమ మెర్సిడెస్-బెంజ్ కార్లు ఉంటాయని ఆశాభావంతో ఉంది.
జనవరి-మార్చి త్రైమాసికం కార్ల విక్రయాల్లో బెస్ట్‌గా నిలిచిందంటున్నారు మెర్సిడెస్-బెంజ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ లాన్స్ బెన్నెట్. 2022 జనవరి-మార్చి త్రైమాసికంతో పోలిస్తే 17 శాతం గ్రోత్ తో ఈ ఏడాది 4697 కార్లను విక్రయించింది. దీన్ని బట్టి భారతీయులు లగ్జరీ కార్లపై మోజు పెంచుకుంటున్నారని అర్థమవుతుందని ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. టాప్ హెడ్ వెహికల్ (టీఈవీ) సెగ్మెంట్లో 107 శాతం గ్రోత్ నమోదైందన్నారు. వచ్చే తొమ్మిది నెలల్లో తమ కార్ల విక్రయాల్లో డబుల్ డిజిట్ గ్రోత్ నమోదవుతుందని అంచనా వేశారు. తమ కార్ల డెలివరీలో వెయింటింగ్ పీరియడ్ తగ్గించడానికి చర్యలు తీసుకుంటామన్నారు.
జనవరి-మార్చి మధ్య ఈ-క్లాస్ ఎల్ డబ్ల్యూబీ & జీఎల్ఎస్ అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. సెడాన్ సెగ్మెంట్లో ఈ-క్లాస్ ఎల్ డబ్ల్యూబీ 27 శాతం, సీ-క్లాస్ 30 శాతం సేల్స్ నమోదయ్యాయని తెలిపారు. సెడాన్, ఎస్యూవీ పోర్ట్ పోలియో కార్లకు మంచి ఆదరణ లభించిందని లాన్స్ బెన్నెట్ తెలిపారు. ఫస్ట్ టైం లగ్జరీ కార్ల కొనుగోలు దారులే లక్ష్యంగా తమ కార్ల ఉత్పత్తులు ఉంటాయన్నారు.
మెట్రోపాలిటన్ నగరాల పరిధిలో మెర్సిడెస్-బెంజ్ కార్లకు డిమాండ్ పెరుగుతున్నది. కటక్, కర్నాల్, కాలికట్ వంటి నగరాల వాసులు లగ్జరీ కార్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కరోనా మహమ్మారి తర్వాత మౌలిక వసతులు పెరగడం, రాహదారుల పరిస్థితి మెరుగవ్వడంతోపాటు ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి మొగ్గుతున్నారు. ద్వితీయ, త్రుతీయ శ్రేణి నగరాల పరిధిలో ఇండిపెండెంట్ హౌస్ గల వారికి చార్జింగ్ ఫెసిలిటీ సౌలభ్యంగా ఉంటుందన్నారు.
కుర్రాళ్లు లగ్జరీ కార్ల వైపు మొగ్గుతున్నారు. సగటున 38 ఏండ్లలోపు కుర్రాళ్లు మెర్సిడెస్ -బెంజ్ ఎస్-క్లాస్ కార్లపై మోజు పెంచుకుంటున్నారు. సీ-క్లాస్ కార్ల కోసం 35 ఏండ్ల కుర్రాళ్లు ఆసక్తి చూపుతున్నారు. వేతన జీవులు, ప్రొఫెషనల్స్ లగ్జరీ, ప్రీమియం కార్ల వైపు మొగ్గుతున్నారు.