హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): అమెరికన్ కాన్సులేట్ సిబ్బందికి చేయూతను అందించడానికి మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్(ఎంఈఐఎల్) ముందుకొచ్చింది. హైదరాబాద్లోని నానక్రామ్గూడ వద్ద ఉన్న అమెరికన్ కాన్సులేట్ కార్యాలయం వద్ద భద్రత విధులు నిర్వర్తించే తెలంగాణ స్పెషల్ పోలీసులకు విశ్రాంతి భవన నిర్మాణానికి శనివారం కంపెనీ డైరెక్టర్ పీ సుధారెడ్డి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..పోలీసుల సేవలు నిరుపమానమని, రాత్రింబవళ్లు ప్రజల భద్రతకు వారి కృషి వెల కట్టలేదని చెప్పారు. కంపెనీ సొంత నిధులతో నిర్మించతలపెట్టిన ఈ విశ్రాంతి భవనంలో 50 మంది భద్రతా సిబ్బంది వినియోగించుకునేలా డిజైన్ చేసినట్టు చెప్పారు. ప్రీ ఫ్యాబ్రికేటెడ్ పద్దతిలో త్వరగా ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేసి పోలీస్ సిబ్బందికి అప్పగించనున్నట్టు తెలిపారు.