Tata Punch | సాధారణంగా కార్ల తయారీలో, విక్రయంలోనూ మొదటి స్థానంలో నిలుస్తుంది మారుతి సుజుకి. చాలా కాలంగా అన్ని సెగ్మెంట్ల కార్ల విక్రయంలోనూ మారుతి సుజకి టాప్. 2024లో మాత్రం టాటా మోటార్స్ మైక్రో ఎస్యూవీ కారు టాటా పంచ్ అత్యధిక కార్లు విక్రయించిన రికార్డు నెలకొల్పింది. 2024లో కార్ల విక్రయాల్లో మారుతి సుజుకి వ్యాగన్ఆర్ (Maruti Suzuki Wagon R), మారుతి సుజుకి ఎర్టిగా (Maruti SUzuki Ertiga), మారుతి సుజుకి బ్రెజా (Maruti Suzuki Breza), హ్యుండాయ్ క్రెటా (Hyundai Creta)కార్ల కంటే టాప్‌లో నిలిచింది మైక్రో ఎస్యూవీ కారు టాటా పంచ్ (Tata Punch). టాటా పంచ్ ఇంటర్నల్ కంబుస్టన్ ఇంజిన్ (ఐసీఈ), ఎలక్ట్రిక్ వర్షన్ కార్లతో కలిపి 2023లో 1,50,182 కార్లు విక్రయిస్తే, 2024లో 34.52 శాతం వృద్ధితో 2,02,031 యూనిట్లు విక్రయించింది.
టాటా పంచ్ (Tata Punch) తొలుత 2021 అక్టోబర్ నెలలో మార్కెట్లో ఆవిష్కరించారు. 2024 జనవరిలో టాటా పంచ్.ఈవీ (Tata Punch.ev) కారు మార్కెట్లోకి రావడంతో టాటా పంచ్ బ్రాండ్‌గా తనదైన ముద్ర వేసుకున్నది. టాటా పంచ్ పెట్రోల్, సీఎన్జీ, ఎలక్ట్రిక్ అవతార్ల్లో లభిస్తుండటం వల్లే ఈ కారు ఎక్కువగా అమ్ముడవుతున్నది. సేఫ్టీ ఫీచర్లతో వస్తున్న టాటాపంచ్ కారుకు భారత్ ఎన్-క్యాప్, గ్లోబల్ ఎన్-క్యాప్ వద్ద 5-స్టార్ రేటింగ్ లభిస్తుంది. దీంతోపాటు అతి తక్కువ ధరకే లభించడం కూడా అత్యధికంగా పంచ్ కార్లు అమ్ముడు కావడానికి కారణం.
టాటా పంచ్ ఐసీఈ కారు 1.2 లీటర్ల రెవట్రోన్ పెట్రోల్ ఇంజిన్ (గరిష్టంగా 88పీఎస్ విద్యుత్, 115 ఎన్ఎం టార్క్) విత్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో లభిస్తుంది. సీఎన్జీ ఆప్షన్ (73 పీఎస్ విద్యుత్, 103 ఎన్ఎం టార్క్) విత్ 5- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లో అందుబాటులో ఉంది. టాటా పంచ్ సీఎన్జీ వేరియంట్ ట్విన్ సీఎన్జీ ట్యాంకులు కలిగి ఉంటుంది.
టాటా పంచ్.ఈవీ కారు స్టాండర్డ్ వేరియంట్ (25కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ – సింగిల్ చార్జింగ్‌తో 315 కి.మీ దూరం ప్రయాణం, 60 కిలోవాట్ల విద్యుత్, 114 ఎన్ఎం టార్క్), లాంగ్ రేంజ్ వేరియంట్ (సింగిల్ చార్జింగ్‌తో 421 కి.మీ దూరం ప్రయాణం, 35కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్, 90కిలోవాట్ల విద్యుత్, 190 ఎన్ఎం టార్క్) వస్తున్నాయి. టాటా పంచ్ ఐసీఈ కారు ధర రూ.6.13 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి రూ.10.15 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకూ పలకుతుంది. టాటా పంచ్.ఈవీ కారు ధర రూ.9.99 లక్షల నుంచి (ఎక్స్ షోరూమ్) నుంచి రూ.14.29 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకూ పలుకుతుంది.