న్యూఢిల్లీ, నవంబర్ 28: సాఫ్ట్‌బ్యాంక్ వెనకుండి నడిపిస్తున్న ఈ-కామర్స్ సేవల సంస్థ మీషో ఎట్టకేలకు స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నది. ఇందుకు సంబంధించి స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి దరఖాస్తు చేసుకున్న సంస్థకు అక్కడి నుంచి పూర్తిస్థాయిలో అనుమతులు లభించాయి. దీంతో వచ్చేవారంలో కంపెనీలో వాటాలను విక్రయించనున్నట్టు ప్రకటించింది.
డిసెంబర్ 3న ప్రారంభంకానున్న ఈ వాటాల విక్రయం అదే నెల 5న ముగియనున్నదని తెలిపింది. ఈ వాటాల విక్రయంతో గరిష్ఠంగా రూ.5,421 కోట్ల నిధులను సమీకరించాలని కంపెనీ యోచిస్తున్నది. షేరు ధరల శ్రేణిని రూ.105 నుంచి రూ.111 మధ్యలో నిర్ణయించింది. ఈ ఐపీవోలో భాగంగా రూ.4,250 కోట్ల విలువైన షేర్లను జారీ చేయనుండగా, అలాగే ఆఫర్ ఫర్ సేల్ రూట్లో 10.55 కోట్ల షేర్లను విక్రయించడంతో మరో రూ.1,171 కోట్ల నిధులను సమీకరించనున్నది.