MCX Gold Rate | ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ బలంగా ఉండడంతో బంగారం తులం ధర రూ.1,30,638 చేరింది. వెండి ఫ్యూచర్స్ కిలోకు రూ.1,82,600కి పడిపోయింది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాది చివరి పాలసీ సమావేశం జరుగనున్నది. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవరించారు. దాంతో బంగారానికి డిమాండ్ పెరిగింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఫిబ్రవరి 2026 కాంట్రాక్టుకు సంబంధించి గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు 0.13 శాతం పెరిగి రూ.1,30,638కి చేరుకుంది. అయితే, సిలర్వ్ ఫ్యూచర్స్ 0.44 శాతం తగ్గి కిలోకు రూ.1,82,600కి చేరాయి.
శుక్రవారం ఎంఎసీఎక్స్లో సిల్వర్ రూ.7,096 పెరిగి రికార్డు స్థాయిలో రూ.1,85,234 మార్క్‌ను చేరుకుంది. చివరికు కిలోకు రూ.1,83,408 వద్ద ముగిసింది. గతవారంలో వెండి భారీగా 4.81శాతం వరకు పెరిగి.. 3శాతానికిపైగా లాభపడ్డాయి. తాజాగా ప్రారంభంలో కొంత లాభాల స్వీకరణకు చూసిందని.. కానీ, లండన్, చైనాలో తగ్గుతున్న నిల్వలు, 2026 వరకు నిర్మాణాత్మక లోటు కొనసాగుతుందన్న ఆందోళన మధ్య స్థిరంగా ఉందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ విశ్లేషకుడు మానవ్ మోదీ తెలిపారు.
బలమైన పారిశ్రామిక డిమాండ్, సురక్షిత స్వర్గధామ పెట్టుబడికావడంతో కొనసాగుతున్న పెట్టుబడులు ఈటీఎఫ్‌లో వెండిని బలోపేతం చేశాయన్నారు. ఇక ఏడాది చివరి పాలసీ సమావేశానికి ముందు ఫెడ్ రిజర్వ్ రేట్లను సడలించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారని.. దాంతో మార్కెట్ పెరుగుతుందని మోదీ తెలిపారు. ఈ వారం పెట్టుబడిదారుల దృష్టి ఫెడ్ తుది సమావేశంపై మాత్రమే కాకుండా, యూఎస్ ఫ్యాక్టరీ ఆర్డర్లు, ఇతర కీలకమైన స్థూల ఆర్థిక డేటాపై ఉంటుందని చెప్పారు.
ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ప్రసంగం వరకు వ్యాపారులు అప్రమత్తంగా వ్యవహరించే అవకాశం ఉందన్నారు. ఎందుకంటే ఫెడ్ వైఖరిలో ఏదైనా మార్పులు బులియన్ ధరల్లో అస్థిరతకు దారి తీసే అవకాశం ఉందన్నారు. రిలయన్స్ సెక్యూరిటీస్‌లో సీనియర్ పరిశోధన విశ్లేషకుడు జిగర్ త్రివేది మాట్లాడుతూ.. బంగారం ధరలు ఔన్సుకు 4,200 డాలర్లకు చేరుకున్నాయి. ఫెడ్ చివరి సమావేశంలో 25 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం 88శాతం వరకు ఉందని త్రివేది తెలిపారు.
వచ్చే ఏడాది సైతం మరిన్ని వడ్డీ రేట్లలో కోత విధించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు ఆశిస్తున్నాయి. కామెక్స్‌లో ఫిబ్రవరి డెలివరీకి సంబంధించి గోల్డ్ ఫ్యూచర్లు ఔన్సుకు 4,244.2 డాలర్ల వద్ద స్థిరంగా ట్రేడవుతున్నది. మార్చి 2026 కాంట్రాక్టుకు సంబంధించిన కామెక్స్ సిల్వర్ ఫ్యూచర్స్ 0.54 శాతం తగ్గి ఔన్సుకు 58.73 డాలర్ల వద్దకు చేరింది. శుక్రవారం సిల్వర్ 4.19శాతం పెరిగి ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి ఔన్స్‌కు 59.90 డాలర్లకు పెరిగింది.