హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ ఫాస్ట్‌ఫుడ్ దిగ్గజం ‘మెక్ డొనాల్డ్స్’ 1.56 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైటెక్ సిటీలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ (జీసీసీ)ను ఏర్పాటు చేసింది. బుధవారం తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమారతో కలిసి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దీన్ని లాంఛనంగా ప్రారంభించారు. అమెరికాకు వెలుపల మెక్ డొనాల్డ్స్‌కు ఇదే అతిపెద్ద కేంద్రం కావడం విశేషం. ఇది మెక్ డొనాల్డ్స్ ఇన్నోవేషన్, ఎంటర్ప్రైజ్ ఆపరేషన్స్‌కు ‘గ్లోబల్ హబ్’గా పనిచేయనున్నది. ఈ జీసీసీ ద్వారా కొత్తగా 1,200 మంది అత్యంత నైపుణ్యం కలిగిన వారికి ఉపాధి లభించనున్నది. అలాగే రియల్ ఎస్టేట్, సేవలు, లాజిస్టిక్స్ వంటి అనుబంధ రంగాలకు ప్రయోజనం కలుగనున్నది. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..
పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణలో అపార అవకాశాలున్నాయని, ముఖ్యంగా ఇక్కడి పరిశ్రమలకు అనువైన ఎకో సిస్టం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, నైపుణ్యం తదితర అంశాలు బాగా కలిసొస్తాయని చెప్పారు. మెక్ డొనాల్డ్స్ అంటే గ్లోబలైజేషన్‌కు నిలువెత్తు నిదర్శనమన్న ఆయన.. ముందుచూపుతో 1991లో అప్పటి ప్రధాన మంత్రి పీవీ నర్సింహారావు అమలు చేసిన సంసరణల వల్ల ఎన్నో అంతర్జాతీయ కంపెనీలు మన దేశంలోకి అడుగు పెట్టాయన్నారు. ఇకడ కార్యకలాపాలు ప్రారంభించి మన ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యమయ్యాయని వివరించారు. హైదరాబాద్‌లోని జీసీసీలు యావత్తు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయని, ఇకడ కేవలం టెక్నాలజీ సంబంధిత జీసీసీలేగాక, అన్ని రంగాలకు చెందిన జీసీసీలను ఏర్పాటు చేసేందుకు దేశ, విదేశీ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఆతిథ్య రంగ దిగ్గజ సంస్థ మారియట్ తన మొదటి జీసీసీని ప్రారంభించేందుకు హైదరాబాద్‌ను ఎంచుకున్నదని ఆయన వివరించారు.