ICICI Bank-HDFC Bank | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈలోని టాప్-10 సంస్థల్లో ఆరు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,97,734.77 కోట్లు పెరిగింది. వాటిలో ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ భారీగా లబ్ధి పొందాయి. గతవారం బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 1,653.37 పాయింట్లు (1.99 శాతం) లాభంతో ముగిసింది. శుక్రవారం బీఎస్ఈ సెన్సెక్స్ 1359.51 (1.63 శాతం) పాయింట్లు పుంజుకుని తాజా జీవిత కాల గరిష్టం 84,544.31 పాయింట్ల వద్ద స్థిర పడింది. అంతకుముందు ఇంట్రాడే ట్రేడింగ్ లో సెన్సెక్స్ 1509.66 పాయింట్ల వృద్ధితో 84,694.46 పాయింట్ల జీవిత కాల గరిష్ట స్థాయికి దూసుకెళ్లింది.
ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.63,359.79 కోట్లు పుంజుకుని రూ.9,444,226.88 కోట్ల వద్ద స్థిర పడింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.58,569.52 కోట్లు వృద్ధి చెంది రూ.13,28,605.29 కోట్ల వద్ద ముగిసింది. భారతీ ఎయిర్ టెల్ ఎం-క్యాప్ రూ.44,319.91 కోట్ల లాభంతో రూ.9,74,810.11 కోట్ల వద్ద నిలిచింది. రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.19,384.07 కోట్లు లాభ పడి రూ.20,11,544.68 కోట్లకు దూసుకెళ్లింది. హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) ఎం-క్యాప్ రూ.10,725.88 కోట్ల లబ్ధితో రూ.7,00,084.21 కోట్లకు చేరింది. ఐటీసీ ఎం-క్యాప్ రూ.1,375.6 కోట్లు పుంజుకుని రూ.6,43,907.42 కోట్ల వద్ద ముగిసింది.
మరోవైపు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.85,730.59 కోట్ల నష్టంతో రూ.15,50,459.04 కోట్ల వద్ద నిలిచింది. ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.15,861.16 కోట్ల పతనంతో రూ.7,91,438.39 కోట్ల వద్ద స్థిర పడింది. భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.14,832.12 కోట్లు పతనమై రూ.6,32,172.64 కోట్లకు చేరుకుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఎం-క్యాప్ రూ.7,719.79 కోట్లు నష్టపోయి రూ.6,97,815.41 కోట్ల వద్ద స్థిర పడింది. గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈ టాప్-10 సంస్థల్లో రిలయన్స్ మొదటి స్థానంలో నిలిచింది. తర్వాతీ స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, భారతీ ఎయిర్ టెల్, ఐసీఐసీఐ బ్యాంకు, ఇన్ఫోసిస్, హిందూస్థాన్ యూనీ లివర్, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఐటీసీ, ఎల్ఐసీ నిలిచాయి.