హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భారీ సంఖ్యలో ఇండస్ట్రియల్ పార్కులు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటైన విషయం తెలిసిందే. అయితే గత రెండేండ్లుగా కాంగ్రెస్ సర్కార్ కొత్త వాటిని అభివృద్ధి చేసే విషయంలో అలసత్వం ప్రదర్శిస్తున్నదనే విమర్శలున్నాయి. ఒక్కటంటే ఒక్క ఇండస్ట్రియల్ పార్క్ కూడా ఏర్పాటు కాలేదు మరి. కాగా, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కొండాపూర్ గ్రామంలో 191 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ పార్క్‌ను త్వరలోనే ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో మొత్తం 104 ప్లాట్లుండగా, ఇప్పటివరకు 36 పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. మరో 28 నిర్మాణంలో ఉన్నాయి. ఇంకొన్ని ప్లాట్లను ఇంకా విక్రయించాల్సి ఉన్నది. త్వరలో ఈ ఇండస్ట్రియల్ పార్క్‌ను ప్రారంభించేందుకు పరిశ్రమల శాఖ సన్నాహాలు చేస్తున్నది.
భారీగా ల్యాండ్ బ్యాంక్
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో కేవలం 109 పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేయగా, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదేండ్లలోనే 56 ఇండస్ట్రియల్ పార్క్‌లను ఏర్పాటు చేశారు. మరో 70 ఇండస్ట్రియల్ ఎస్టేట్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అంతేకాదు బీఆర్ఎస్ సర్కార్ వివిధ జిల్లాల్లో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి, వాటిని పరిశ్రమల కోసం వాడుకోవాలన్న లక్ష్యంతో 1,43,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్‌ను సిద్ధం చేసింది. అప్పటి టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో వాటిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి పరిశ్రమలకు కేటాయించాలని నిశ్చయించింది. అందులో భాగంగా 2014-23 మధ్య కొత్తగా 56 ఇండస్ట్రియల్ పార్క్‌లను అభివృద్ధి చేసింది. ఇందులో 23 పార్క్‌లను హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయగా, మరో 33 పార్క్‌లు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటయ్యాయి. ఈ పారిశ్రామిక వాడల్లోనే ప్రస్తుత ప్రభుత్వం పరిశ్రమల కోసం భూములను కేటాయిస్తుండగా, గతంలో ప్రణాళికలు సిద్ధం చేసిన పారిశ్రామిక వాడలు ఇప్పుడు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి. ఈ కోవలోకే వస్తుంది కొండాపూర్ ఇండస్ట్రియల్ పార్క్.
యాన్సిలర్ యూనిట్లు
బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ పార్క్లవల్ల అనేక మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించడమే కాకుండా పెద్ద పరిశ్రమలకు అనుబంధంగా మరెన్నో యాన్సిలర్ యూనిట్లు ఏర్పాటయ్యాయి. ఉదాహరణకు మెదక్‌లో ఐటీసీ పరిశ్రమకు అనుబంధంగా 18 యాన్సిలర్ యూనిట్లు వచ్చాయి. సిరిసిల్ల అప్పారెల్ పార్క్‌లోని కంపెనీలు ఇతర దేశాలకు ఎగుమతి చేసే నాణ్యమైన వస్ర్తాలను ఉత్పత్తి చేస్తున్నాయి. వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌లోని కిటెక్స్, యంగ్వన్ కంపెనీలు సైతం ఎగుమతులకు వీలైన నాణ్యతతోనే వస్ర్తాలను ఉత్పత్తి చేస్తున్నాయి. వీటిద్వారా స్థానిక పత్తి రైతులకు గిట్టుబాటు ధర లభించడంతోపాటు వేల సంఖ్యలో స్థానికులకు ఉపాధి అవకాశాలూ లభిస్తున్నాయి.
70 కొత్త పారిశ్రామిక వాడలు
పదేండ్లలో 56 ఇండస్ట్రియల్ పార్క్‌లు ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ సర్కార్.. జిల్లాలవారీగా మరో 70 పారిశ్రామిక వాడల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించి ఆమోదించింది. ఇందులో రంగారెడ్డి జిల్లాలో 19, మెదక్-7, సంగారెడ్డి-6, సిద్దిపేట-6, వికారాబాద్-5, యాదాద్రి భువనగిరి-4, మహబూబ్‌నగర్-3, జగిత్యాల, ఖమ్మం, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, నిర్మల్, వరంగల్ తదితర జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున, మిగిలినవి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటికి సంబంధించిన లేఔట్లను సిద్ధం చేసిన టీఎస్ఐఐసీ.. మౌలిక సదుపాయాల కల్పనకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా, అప్పటి బీఆర్ఎస్ సర్కార్ వాటిని ఆమోదించింది. దశలవారీగా పరిశ్రమల అవసరాలకు తగ్గట్టు ఒక్కొక్కటిగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్.. నాడు ఏర్పాటుచేసిన పార్క్లనే ప్రారంభిస్తున్నది.