న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ..దేశీయ మార్కెట్లోకి సరికొత్త విక్టోరిస్ మాడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మధ్యస్థాయి ఎస్యూవీ సెగ్మెంట్‌ను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ నయా మాడల్‌ను ప్రవేశపెట్టినట్టు కంపెనీ ఎండీ, సీఈవో హిసాచీ టకెచి తెలిపారు. ప్రస్తుతం సంస్థ ఫ్రాంక్స్, బ్రెజ్జా, జిమ్నీ, గ్రాండ్ విటారా మాడళ్లను దేశీయంగా విక్రయిస్తున్న విషయం తెలిసిందే. గడిచిన నాలుగేండ్ల కాలంలో కంపెనీ మొత్తం విక్రయాల్లో ఎస్యూవీ వాటా మూడింతలు పెరిగి 8.9 శాతం నుంచి 28 శాతానికి ఎగబాకిందన్నారు. ఈ నేపథ్యంలో ఎంట్రీ-ఎస్‌యూవీని ప్రవేశపెట్టినట్టు చెప్పారు. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, హోండా ఎలివేట్లకు పోటీగా సంస్థ ఈ నూతన మాడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కారు ధర సంస్థ వెల్లడించలేదు. అయినప్పటికీ ఈ కారును తీర్చిదిద్దడానికి రూ.1,240 కోట్ల మేర పెట్టుబడి పెటినట్టు ప్రకటించింది.