హైదరాబాద్ : రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల్లో హైదరాబాద్ దూసుకుపోతోంది. ఈ రంగాల్లో ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ ఏడాది ప్రదమార్ధంలో (జనవరి-జూన్) హైదరాబాద్ రూ 2250 కోట్ల పెట్టుబడులను ఆకర్షించగా ఇదే సమయంలో దేశవ్యాప్తంగా సమకూరిన రియల్టీ పెట్టుబడుల్లో ఇది 12.89 శాతం కావడం గమనార్హం. రియల్ ఎస్టేట్ పెట్టుబడుల ఆకర్షణలో పుణే, ముంబై, కోల్‌కతా వంటి నగరాలను హైదరాబాద్ అధిగమించింది.
ఇక సీపీపీ ఇన్వెస్ట్మెంట్స్, ఆర్ఎంజడ్ కార్ప్‌తో కూడిన జాయింట్ వెంచర్ రూ 1500 కోట్లతో హైదరాబాద్, చెన్నై నగరాల్లో ప్రాజెక్టులను చేపడుతుండగా, ఈ ఒప్పందాలను బహుళ నగర ఒప్పందాలుగా చూడటంతో హైదరాబాద్ ఖాతాలో వీటిని చేర్చలేదు. బహుళజాతి కంపెనీలు తమ గ్లోబల్ ఇన్‌హౌస్ కేంద్రాలుగా క్యాంపస్‌ల ఏర్పాటుకు హైదరాబాద్‌నే ఎంచుకుంటున్నాయని, నగరంలో మెరుగైన మౌలిక సదుపాయాలతో పాటు వాణిజ్య అనుకూల ప్రభుత్వం ఉండటంతోనే ఇది సాధ్యమైందని కొలీర్స్ మార్కెట్ డెవలప్మెంట్ ఇండియా ఎండీ, సీఈవో రమేష్ నాయర్ పేర్కొన్నారు.
గత ఏడాది ప్రధమార్ధంలో హైదరాబాద్ రూ 570 కోట్ల పెట్టుబడులను ఆకర్షించగా ఇదే సమయంలో పుణే రూ 290 కోట్ల రియల్ ఎస్టేట్ పెట్టుబడులను ఆకర్షించగలిగిందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది ప్రధమార్ధంలో గత ఏడాదితో పోలిస్తే 52 శాతం వృద్ధితో రూ 18,600 కోట్ల పెట్టుబడులు సమకూరాయని తెలిపారు. ఈ పెట్టుబడుల్లో 35 శాతం కార్యాలయ రంగ పెట్టుబడులు ఉన్నాయని కొలీర్స్ నివేదిక వెల్లడించింది. భారత్‌లో గ్లోబల్ ఫండ్స్‌కు మెరుగైన అవకాశాలు ఉన్నాయని, నిలకడైన రిటన్స్ ఉండటంతో కార్యాలయ ఆస్తులకు ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్ కొనసాగుతుందని రమేష్ నాయర్ స్పష్టం చేశారు.