న్యూఢిల్లీ, జనవరి 29: దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతీ సుజుకీ ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో గతంతో పోల్చితే 16 శాతం ఎగిసి రూ.3,727 కోట్లుగా ఉన్నది. మునుపు రూ.3,207 కోట్లేనని సంస్థ ప్రకటించింది. మొత్తం ఆదాయం కూడా రూ.33,513 కోట్ల నుంచి రూ.38, 764 కోట్లకు ఎగిసింది. వాహన అమ్మకాలు పెరగడమే కారణమన్నది. ఇదిలావుంటే సుజుకీ మోటర్ గుజరాత్ విలీనానికి సంస్థ బోర్డు ఆమోదం తెలిపింది. అలాగే మరో మూడేండ్లు కంపెనీ ఎండీ, సీఈవోగా ఉండేందుకు హిసాషి టకూచీకి లైన్ క్లియరైంది.
దేశీయ ఆటో రంగ సంస్థ టాటా మోటర్స్ ఏకీకృత నికర లాభం అక్టోబర్-డిసెంబర్లో 22 శాతం పడిపోయి రూ.5,578 కోట్లకు పరిమితమైంది. 2023-24 ఇదే త్రైమాసికంలో రూ.7,145 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని అందుకున్నది. అయితే ఏకీకృత ఆదాయం రూ.1,10,577 కోట్ల నుంచి రూ.1,13,575 కోట్లకు పెరిగినట్టు బుధవారం సంస్థ తెలియజేసింది. అయినప్పటికీ ప్యాసింజర్, కమర్షియల్ వాహన విక్రయాల ద్వారా ఆదాయం తగ్గినట్టు పేర్కొన్నది.
గౌతమ్ అదానీకి చెందిన అదానీ పవర్ ఏకీకృత నికర లాభం డిసెంబర్‌తో ముగిసిన 3 నెలల కాలంలో రూ.2,940 కోట్లుగా నమోదైంది. గతంతో పోల్చితే 7 శాతం పెరిగింది. ఏకీకృత ఆదాయం కూడా 11 శాతం పుంజుకొని రూ.14,833 కోట్లుగా ఉన్నది.
ఇండియన్ బ్యాంక్ నికర లాభం అక్టోబర్-డిసెంబర్లో గతంతో పోల్చితే 35 శాతం పెరిగి రూ.2,852 కోట్లుగా నమోదైంది. ఆదాయం రూ.16,099 కోట్ల నుంచి రూ.17,912 కోట్లకు చేరింది.