న్యూఢిల్లీ, ఏప్రిల్ 6 : కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ కొనుగోలుదారులకు శుభవార్తను అందించింది. ఎంపిక చేసిన పలు మాడళ్లపై రూ.2 లక్షల వరకు రాయితీని కల్పిస్తున్నది. వీటిలో ఇన్విక్టోపై రూ.2 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తున్న సంస్థ.. జిమ్నీ, ఫ్రాంక్స్, బాలెనోతోపాటు మరిన్ని మాడళ్లపై రూ.50 వేల వరకు రాయితీని ఇస్తున్నది. ప్రస్తుత నెలకుగాను ఈ ఆఫర్లు వర్తించనున్నాయని ఒక ప్రకటనలో వెల్లడించింది. వీటిలో ఇగ్నిస్పై నగదు ప్రయోజనాల కింద రూ.20 వేలు, ఎక్సేంజ్ బోనస్ కింద మరో రూ.15 వేలు, అలాగే కార్పొరేట్ బోనస్, స్క్రాపేజ్ బోనస్ కింద మరిన్ని ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్నది. అలాగే అత్యధికంగా అమ్ముడవుతున్న బాలెనోపై నగదు బెనిఫిట్ కింద రూ.15 వేలు, అదనపు ఎక్సేంజ్ బోనస్ కింద మరో రూ.15 వేలు ఇస్తున్నది.
ఫ్రాంక్స్ మాడల్పై రూ.40 వేల వరకు నగదు ప్రయోజనాలతోపాటు ఎక్సేంజ్ బోనస్ కింద మరో రూ.10 వేలు లభించనున్నాయి. అలాగే జిమ్నీ మాడల్పై నగదు డిస్కౌంట్ కింద రూ.50 వేలు ఇస్తున్న సంస్థ..ఎక్స్ఎల్ఆర్పై రూ.45 వేల వరకు ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చునని తెలిపింది. వీటిలో రూ.25 వేలు నగదు డిస్కౌంట్ కింద, మరో రూ.20 వేలు ఎక్సేంజ్ బోనస్ కింద లభించనున్నాయి. అలాగే గ్రాండ్ విటారాపై రూ.25 వేలు నగదు డిస్కౌంట్ కింద, రూ.25 వేలతో ఐదేండ్ల పాటు వ్యారెంటీని, ఎక్సేంజ్ బోనస్ కింద రూ.30 వేలు, అప్గ్రేడెడ్ మాడల్పై రూ.20 వేలు అదనంగా కల్పిస్తున్నది. దీంతోపాటు ఇన్విక్టో మాడల్పై రూ.2 లక్షల వరకు ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చునని తెలిపింది.