హన్సల్పూర్ (గుజరాత్), ఆగస్టు 26: భారత్లో పెద్ద ఎత్తున బ్యాటరీ సెల్స్ తయారీకి పెట్టుబడులు పెట్టేందుకు మదుపరులు ముందుకు రాకపోవడం వెనుకున్న కారణాల్లో లిథియం కోసం చైనాపైనే ఆధారపడాల్సి వస్తుండటం ఒకటని మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్సీ భార్గవ అన్నారు. మంగళవారం మారుతీ సుజుకీ తొలి విద్యుత్తు ఆధారిత వాహనం (ఈవీ) ఈ-విటారా ఎగుమతుల్ని 100 దేశాలకు ప్రారంభించారు. ఈ సందర్భంగా భార్గవ మాట్లాడుతూ.. లిథియం కొరత దేశంలో బ్యాటరీ ఇండస్ట్రీని తీవ్రంగా దెబ్బతీస్తున్నదని, చైనాయే మనకు ఏకైక వనరుగా ఉండటం వల్లే ఇదంతా అని అభిప్రాయపడ్డారు.
గుజరాత్లోని హన్సల్పూర్లోగల మారుతీ సుజుకీ వాహన తయారీ కేంద్రంలో భారీ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ కోసం లిథియం-ఐయాన్ బ్యాటరీ సెల్స్ ఉత్పత్తిని ప్రారంభించారు. 2021లోనే ఇక్కడ చిన్నతరహా హైబ్రిడ్ వెహికిల్స్ కోసం బ్యాటరీల తయారీని మారుతీ సుజుకీ అనుబంధ సంస్థ టీడీఎస్ లిథియం-ఐయాన్ బ్యాటరీ గుజరాత్ ప్రైవేట్ లిమిటెడ్ (టీడీఎస్జీ) మొదలు పెట్టిన విషయం తెలిసిందే. కాగా, దేశీయంగా ఎలక్ట్రోడ్ స్థాయి లిథియం-ఐయాన్ బ్యాటరీ సెల్స్ స్థానికతను సాధించిన తొలి సంస్థగా టీడీఎస్జీ నిలిచింది.
వచ్చే 5-6 ఏండ్లలో భారత్లో రూ.70,000 కోట్ల పెట్టుబడుల్ని పెట్టనున్నట్టు జపాన్ ఆటో రంగ దిగ్గజ సంస్థ సుజుకీ మోటర్ కార్పొరేషన్ ప్రకటించింది. దేశీయం కంపెనీ కార్యకలాపాల విస్తరణపై దృష్టి పెట్టినట్టు కంపెనీ డైరెక్టర్, అధ్యక్షుడు తొషిహిరో సుజుకీ తెలిపారు. ఇదిలావుంటే ఈ-విటారా విదేశీ ఎగుమతులను ప్రధాని మోదీ ప్రారంభించారు.