న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటర్ వాహన విక్రయాలు గత నెల మార్చిలో క్షీణించాయి. మంగళవారం విడుదలైన వివరాల ప్రకారం దేశీయంగా మారుతీ అమ్మకాలు నిరుడు మార్చిలో 1,52,718 యూనిట్లుగా ఉంటే.. ఈసారి 1,50,743 యూనిట్లే. ఆల్టో, ఎస్-ప్రెస్సో, బాలెనో, డిజైర్, ఇగ్నీస్, స్విఫ్ట్ సేల్స్ పడిపోయాయి. అయితే గ్రాండ్ విటారా, బ్రెజ్జా, ఎర్టిగా, ఎక్స్ఎల్6 అమ్మకాలు పెరిగాయి.
ఇక హ్యుందాయ్ మోటర్ సేల్స్ కూడా 53,001 యూనిట్ల నుంచి 51,820 యూనిట్లకు దిగజారాయి. అయితే మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాలు 40,631 యూనిట్ల నుంచి 48,048 యూనిట్లకు ఎగిశాయి. టాటా మోటర్స్ విక్రయాలు 3 శాతం పెరిగి 51,872 యూనిట్లుగా ఉన్నాయి. మునుపు 50,297 యూనిట్లే. ఇక గతంతో పోల్చితే ఎంజీ మోటర్, ఆడీ, స్కోడా, కియా, టయోట, హోండా అమ్మకాల్లో వృద్ధి కనిపించింది. ద్విచక్ర వాహనాల్లో రాయల్ ఎన్ఫీల్డ్, టీవీఎస్, సుజుకీ విక్రయాలు పెరిగాయి.