Maruti Cars Price | మారుతి సుజుకి కార్లు మరింత ప్రియం కానున్నాయి. అన్ని రకాల మోడల్ కార్ల ధరలు పెంచుతున్నట్లు సోమవారం ఆ సంస్థ ప్రకటించింది. ఆయా మోడల్ కార్లను బట్టి 0.9 నుంచి 1.9 శాతం మధ్య ధరలు తక్షణం పెంచుతున్నట్లు తెలిపింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతుండటంతో అన్ని వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. ప్రత్యేకించి కార్ల తయారీలో కీలకంగా ఉపయోగించే స్టీల్, రాగి, అల్యూమినియం తదితర కీలక లోహాల ధరలు పెరిగాయి. ఫలితంగా కార్ల తయారీలో ఇన్పుట్ కాస్ట్ పెరిగిపోయిందని మారుతి సుజుకి తెలిపింది. పెరిగిన ధరలు తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఆల్టో నుంచి ఎస్-క్రాస్ వరకు అన్ని మోడల్ కార్ల ధరలు పెరుగుతాయి.
సోమవారం (ఏప్రిల్ 18) నుంచి సగటున అన్ని మోడల్ కార్లపై సగటున 1.3 శాతం ధరలు పెరుగుతాయని మారుతి సుజుకి తెలిపింది. ఇంతకుముందు 2021 జనవరి నుంచి 2022 మార్చి వరకు మారుతి సుజుకి కార్ల ధరలు 8.8 శాతం పెరిగాయి. ఏడాది కాలంగా వివిధ రకాల ఇన్పుట్ కాస్ట్‌లు పెరిగిపోవడంతో కార్ల తయారీపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతున్నదని మారుతి సుజుకి ఈ నెల ప్రారంభంలో రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.
గతవారం వివిధ రకాల కార్ల ధరలు మహీంద్రా అండ్ మహీంద్రా 2.5 శాతం ధరలు పెంచివేసింది. గరిష్టంగా మహీంద్రా అండ్ మహీంద్రా కార్ల ధరలు రూ.63 వేలు పెరిగాయి. ఈ నెల ఒకటో తేదీ నుంచి టయోటా కిర్లోస్కర్ మోటార్స్ నాలుగు శాతం ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. విలాసవంతమైన కార్ల తయారీ సంస్థలు ఆడి, మెర్సిడెజ్ బెంజ్, బీఎండబ్ల్యూ కూడా ధరలు పెంచుతూ ఇటీవల ప్రకటన చేశాయి.