న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ మరోమారు తన వాహన ధరలను పెంచింది. సోమవారం నుంచి అమలులోకి వచ్చేలా అన్ని మోడళ్ళ ధరలను 0.9 శాతం నుంచి 1.9 శాతం వరకు పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది. దీంతో ఆల్టో నుంచి ఎస్-క్రాస్ వరకు అన్ని మోడళ్ళు మరింత ప్రియమయ్యాయి. ఉత్పత్తి వ్యయం పెరగడం వల్లనే ధరలు పెంచాల్సి వచ్చిందని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. దీంతో జనవరి 2021 నుంచి మార్చి 2022 వరకు మారుతి తన వాహన ధరలను ఏకంగా 8.8 శాతం వరకు సవరించింది. ఉత్పత్తి వ్యయం పెరగడం వల్లనే కొనుగోలుదారులపై భారం మోపాల్సి వచ్చిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. గతేడాదికాలంలో స్టీల్, రాగి, అల్యుమినియం, ఇతర ముడి పదార్థాల ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోవడంతో సంస్థపై తీవ్రస్థాయిలో ప్రభావం పడిందన్నారు. మరోవైపు, గతవారంలో మహీంద్రా అండ్ మహీంద్రా కూడా తన వాహన ధరలను 2.5 శాతం వరకు పెంచడంతో తన వాహనాలు రూ.63 వేల వరకు ప్రియమయ్యాయి. అలాగే టయోటా కిర్లోస్కర్, విలాసవంతమైన కార్ల తయారీ సంస్థలైన ఆడీ, మెర్సిడెజ్ బెంజ్, బీఎండబ్ల్యూ కూడా వాహన ధరలను పెంచాయి.