న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ.. ఎంట్రీ లెవల్ కార్ల ధరలను తగ్గించింది. ఆల్టో కే 10, ఎస్-ప్రెస్సో మాడళ్ల ధరలను రూ. 6,500 వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. తగ్గించిన ధరలు వెంటనే అమలులోకి రానున్నట్లు పేర్కొంది.
సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో ఎస్-ప్రెస్సో ఎల్ఎక్స్ఐ పెట్రోల్ వెర్షన్ రూ.2,000 తగ్గనుండగా, ఆల్టో కే10 వీఎక్స్ఐ పెట్రోల్ వెర్షన్ రూ.6,500 కూడా తగ్గనున్నది. దీంతో ఆల్టో కే10 మాడల్ ధర రూ.3.99-5.96 లక్షలకు లభించనుండగా, ఎస్-ప్రెస్సో రూ.4.26 లక్షల నుంచి రూ.6.11 లక్షల లోపు లభించనున్నాయి. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి.
గత నెలకుగాను 3,97,804 యూనిట్ల వాహనాలను విక్రయించినట్లు బజాజ్ ఆటో ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే నెలలో అమ్ముడైన 3,41,648 యూనిట్లతో పోలిస్తే 16 శాతం పెరిగాయని తెలిపింది. వీటిలో దేశీయంగా 2,53,827 యూనిట్లు, 1,43,977 యూనిట్లను ఎగుమతి చేసింది.