Maruti Suzuki | దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి కీలక నిర్ణయం తీసుకున్నది. ఇటీవల మార్కెట్లోకి తీసుకొచ్చిన న్యూ-డిజైర్ టూర్ ఎస్ యూనిట్లను రీకాల్ చేస్తున్నట్లు బుధవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. ఎయిర్‌బ్యాగ్ కాంపొనెంట్‌లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో 166 డిజైర్ టూర్ ఎస్ కార్లు రీకాల్ చేస్తున్నట్లు తెలిపింది.
ఈ నెల ఆరో తేదీ నుంచి16వ తేదీ మధ్య ఉత్పత్తి చేసిన కంపాక్ట్ సెడాన్ కారు డిజైర్ టూర్ ఎస్ యూనిట్లలో ఈ లోపం తలెత్తినట్లు పేర్కొన్నది.`రీ కాల్ చేసిన కార్లలో ఎయిర్‌బ్యాగ్ కంట్రోల్ యూనిట్ ఉచితంగా రీప్లేస్ చేస్తాం` అని వివరించింది. ఎయిర్‌బ్యాగ్ కంట్రోల్ యూనిట్లో లోపం వల్ల అది సరిగ్గా పని చేయకపోవచ్చునని తెలిపింది.
ఎయిర్‌బ్యాగ్ కంట్రోల్ యూనిట్ రీప్లేస్ చేసేవరకు కొనుగోలు చేసిన న్యూ-డిజైర్ టూర్ ఎస్ కార్లు డ్రైవ్ చేయొద్దని కస్టమర్లను మారుతి సుజుకి కోరింది. కంపెనీ ఆథరైజ్డ్ వర్క్‌షాప్‌ల నుంచి లోపాలు ఉన్న డిజైర్ టూర్ ఎస్ కార్ల యజమానులకు ఎయిర్‌బ్యాగ్ కంట్రోల్ యూనిట్ రీప్లేస్మెంట్ కోసం సమాచారం వస్తుందని వివరించింది.
కస్టమర్లు మారుతి సుజుకి వెబ్సైట్లో Imp Customer Info సెక్షన్లో కొనుగోలు చేసిన కారు ఛాసిస్ నంబర్ నమోదు చేస్తే ఆ కారులో ఎయిర్‌బ్యాగ్ కంట్రోల్ యూనిట్లో లోపం ఉందో లేదో తెలుస్తుందని పేర్కొన్నది. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం దాదాపు ప్రతి కారులోనూ ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే.