Auto Sales | అక్టోబర్ నెలలో కార్ల విక్రయాలు అంతంత మాత్రంగానే సాగాయి. మారుతి సుజుకి మినహా మిగతా సంస్థల కార్ల సేల్స్ పర్వాలేదనిపించాయి. బతుకమ్మ, నవరాత్రి ఉత్సవాలు, విజయదశమి, దీపావళి పండుగల నేపథ్యంలో కార్ల విక్రయాలు పుంజుకుంటాయని ఆటోమొబైల్ కంపెనీలు పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. ఆటోమొబైల్ దిగ్గజాలు మారుతి సుజుకి కార్ల విక్రయాలు 2023తో పోలిస్తే గత నెలలో ఐదు శాతం తగ్గితే, హ్యుండాయ్ సేల్స్ స్వల్పంగా పెరిగాయి.
2023 అక్టోబర్ నెలలో 1,68,047 కార్లు విక్రయించిన మారుతి సుజుకి గత నెలలో 1,59,591 యూనిట్లకు పరిమితమైంది. విదేశాలకు ఎగుమతులతో కలుపుకుని 2,06,434 కార్లు విక్రయించామని మారుతి సుజుకి తెలిపింది. గత నెల కార్ల విక్రయాల్లో నాలుగు శాతం వృద్ధి సాధించామని వెల్లడించింది. మినీ సెగ్మెంట్ లో ఆల్టో, ఎస్-ప్రెస్సో మోడల్ కార్ల విక్రయాలు 14,568 నుంచి 10,687 యూనిట్లకు పడిపోయాయి. ఇక కంపాక్ట్ కార్లు – బాలెనో, సెలేరియో, డిజైర్, ఇగ్నీస్, స్విఫ్ట్, టూర్ ఎస్, వ్యాగన్ఆర్ వంటి కార్ల విక్రయాలూ 80,662 నుంచి 65,948 యూనిట్లతో సరిపెట్టుకున్నది. మరోవైపు యుటిలిటీ వెహికల్స్ – బ్రెజా, గ్రాండ్ విటారా, ఎర్టిగా, ఎక్స్ఎల్6 కార్లు మాత్రం 59,147 యూనిట్ల నుంచి 70,644 యూనిట్లకు పెంచుకున్నది మారుతి సుజుకి.
హ్యుండాయ్ గతేడాది 55,128 కార్లు విక్రయిస్తే గత నెలలో 55,568 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఫెస్టివ్ సీజన్ లో తమ ఎస్ యూవీ పోర్ట్ ఫోలియో కార్లకు మంచి గిరాకీ ఏర్పడిందని హ్యుండాయ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తరుణ్ గార్గ్ తెలిపారు. హ్యుండాయ్ క్రెటా కార్లు 17,497 యూనిట్లతోపాటు ఎస్యూవీ కార్లు 37,902 యూనిట్లు విక్రయించామని, ఒక నెలలో ఇదే గరిష్టం అని అన్నారు. హ్యుండాయ్ కార్లలో 68 శాతం ఎస్‌యూవీలే ఉండటం ఆసక్తికర పరిణామం.
ఇక దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా విక్రయాలు 25 శాతం పుంజుకున్నది. 2023 అక్టోబర్ నెలతో పోలిస్తే 43,708 కార్ల నుంచి గత నెలలో 54,504 యుటిలిటీ వెహికల్స్ విక్రయించినట్లు మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్ ప్రెసిడెంట్ విజయ్ నక్రా తెలిపారు. మొత్తం కార్ల విక్రయాలు 96,648 యూనిట్లలో ఎస్ యూవీ కార్ల విక్రయాలు 54,504 కార్లు ఉన్నాయి. ఇది 25 శాతం ఎక్కువ. ఫెస్టివ్ సీజన్ లో తొలి 60 నిమిషాల్లో 5-డోర్ ఆఫ్ రోడ్ ఎస్యూవీ థార్ రాక్స్ 1.7 లక్షల బుకింగ్స్ నమోదు కావడం పాజిటివ్ సంకేతం అని విజయ్ నక్రా పేర్కొన్నారు.
ఒక మరో దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ సేల్స్ మాత్రం 48,337 యూనిట్ల నుంచి 48,131 యూనిట్లకు పడిపోయింది. టయోటా కిర్లోస్కర్ కార్ల విక్రయాలు 20,542 నుంచి 28,138 యూనిట్లకు పెంచుకున్నది. జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్స్ సేల్స్ 31 శాతం పెరిగాయి. ద్విచక్ర వాహనాల్లో రాయల్ ఎన్ ఫీల్డ్ ఫెస్టివ్ సీజన్ నేపథ్యంలో గత నెలలో లక్ష పై చిలుకు మోటారు సైకిళ్ల విక్రయంతో సరికొత్త రికార్డు నెలకొల్పింది.