న్యూఢిల్లీ, డిసెంబర్ 6 : కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ కూడా కొనుగోలుదారులకు షాకిచ్చింది. నూతన సంవత్సరంలో వాహనాలు కొనుగోలు చేసేవారి జేబులకు మరిన్ని చిల్లులు పడనున్నాయి. జనవరి నుంచి కార్ల ధరలను 4 శాతం వరకు పెంచుతుండటమే ఇందుకు కార ణం. ఉత్పత్తి వ్యయం పెరగడంతోపాటు నిర్వహణ ఖర్చులు అధికమవడం వల్లనే కార్ల ధరలు పెంచాల్సి వస్తున్నదని కంపెనీ బీఎస్ఈకి సమాచారం అందించింది. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో ఆయా మాడళ్లు నాలుగు శాతం వరకు పెరగనున్నాయి. ఫారెక్స్ మార్కెట్లో కరెన్సీ హెచ్చుతగ్గుదలకారణంగా సంస్థపై పడుతున్న అదనపు భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా కొంతమేర ధరలు పెంచినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం సంస్థ ఆల్టో నుంచి మల్టీ-యుటిలిటీ వాహనమైన ఇన్విక్టో మాడల్‌ను దేశీయంగా విక్రయిస్తున్నది. ఇప్పటికే హ్యుందాయ్ మోటర్ రూ.25 వేల వరకు ధరలు పెంచగా, లగ్జరీ కార్ల తయారీ సంస్థయైన మెర్సిడెజ్-బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడీలు తమ వాహన ధరలు పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి కూడా.
మహీంద్రా, ఎంజీ మోటర్ కూడా వాహన ధరలను పెంచబోతున్నట్లు ప్రకటించాయి. జనవరి 1 నుంచి అమలులోకి వచ్చేలా వాహన ధరలను 3 శాతం వరకు పెంచుతున్నట్లు తెలిపింది. రవాణ ఖర్చులతోపాటు ఇతర ఖర్చులు పెరగడం వల్లనే ధరలు పెంచాల్సి వచ్చిందని పేర్కొంది.