Stocks | మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు ఆల్‌టైం రికార్డు నెలకొల్పాయి. అమెరికా రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో నష్టాల్లో ముగిశాయి. దీంతో వరుస రెండు సెషన్ల లాభాలకు బ్రేక్ పడింది. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 377.50 పాయింట్లు (0.54శాతం) నష్టంతో 69,551.03 పాయింట్ల వద్ద ముగిసింది.
తొలుత స్వల్ప లాభాలతో ట్రేడింగ్ ప్రారంభమైన స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యం ఇవ్వడంతో నష్టాల్లో ట్రేడింగ్ అయింది. ఫలితంగా బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 70 వేలు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 21 వేల మైలురాయికి దిగువన ముగిశాయి. ఉదయం సెన్సెక్స్ 70,020.68 పాయింట్ల వద్ద లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించి అంతర్గత ట్రేడింగ్‌లో 70,036.64 పాయింట్ల గరిష్ట స్థాయికి, తిరిగి 484.68 పాయింట్ల నష్టంతో 69,443.85 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 377.50 పాయింట్ల పతనంతో 69,551.03 పాయింట్ల వద్ద ముగిసింది.
మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ ఇంట్రాడే ట్రేడింగ్‌లో 21,037.90 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకి ట్రేడింగ్ ముగిసే సమయానికి 90.70 పాయింట్ల నష్టంతో 20,906.40 పాయింట్ల వద్ద స్థిర పడింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు సోమవారం భారీగా స్టాక్స్ కొనుగోలు చేయడంతో పలు కీలక స్టాక్స్ లైఫ్ టైం గరిష్ట స్థాయికి చేరాయి.
సెన్సెక్స్-30లో ఇండస్ఇండ్ బ్యాంక్, మారుతి సుజుకి, టైటాన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎన్టీపీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, లార్సెన్ అండ్ టర్బో, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్టాక్స్ భారీగా నష్టపోయాయి. ఆల్ట్రాటెక్ సిమెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, యాక్సిస్ బ్యాంక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్0, విప్రో, ఐటీసీ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఏషియన్ మార్కెట్లలో షియోల్, టోక్యో, షాంఘై, హాంకాంగ్ మార్కెట్లు పాజిటివ్ నోట్‌తో ముగిశాయి. యూరోపియన్ యూనియన్ స్టాక్ మార్కెట్లు లాభాల్లో స్థిరపడగా, సోమవారం యూఎస్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.
సోమవారం కూడా బీఎస్ఈ -30 ఇండెక్స్ సెన్సెక్స్ ఇంట్రాడే ట్రేడింగ్‌లో 70,057.83 పాయింట్ల గరిష్ట స్థాయిని దూసుకెళ్లి, చివరకు 69,928.53 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ ఇండెక్స్ నిఫ్టీ 27.70 పాయింట్లు (0.13 శాతం) లాభంతో 21 వేల మార్కుకు దిగువన 20,997.10 పాయింట్ల వద్ద స్థిర పడింది.