Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఆల్‌టైం రికార్డు నెలకొల్పాయి. అమెరికాతోపాటు భారత్‌లో ఆర్థిక పరిస్థితులు మెరుగు పడటంతో ఇన్వెస్టర్లలో జోష్ కనిపించింది. ఇటు బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్, అటు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ ఒక శాతానికి పైగా పుంజుకుని న్యూ ఆల్‌టైం రికార్డులకు చేరుకున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 71 వేల పాయింట్ల మార్క్‌ను దాటేసింది. ఐటీ, టెక్, మెటల్ ఈక్విటీలకు ఇన్వెస్టర్ల నుంచి కొనుగోలు మద్దతు లభించింది.
విదేశీ ఇన్వెస్టర్లు షేర్లు కొనుగోలు చేయడంతో దేశీయ మదుపర్లలో పాజిటివ్ సెంటిమెంట్ బలోపేతమైంది. వరుసగా మూడో రోజు బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ 969.55 పాయింట్ల వృద్ధితో 71,483.75 పాయింట్ల వద్ద స్థిర పడింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 1096.51 పాయింట్లు (1.54 శాతం) పుంజుకుని 71,605 పాయింట్ల వద్దకు దూసుకెళ్లింది. బీఎస్సీ సెన్సెక్స్- 30 ఇండెక్స్‌లో 1961 స్టాక్స్ పుంజుకోగా, 1801 షేర్లు పతనమయ్యాయి. మరో 118 స్టాక్స్ యధాతథంగా కొనసాగాయి.
ఇటు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 273.95 పాయింట్లు (1.29 శాతం) లబ్ధితో 21,456.65 పాయింట్ల నూతన గరిష్ట ముగింపు వద్ద సెటిలైంది. అంతర్గత ట్రేడింగ్‌లో 309.6 పాయింట్ల (1.29 శాతం)తో ఆల్‌టైం గరిష్టం 21,492.30 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం ట్రేడింగ్‌లో బీఎస్ఈ సెన్సెక్స్ 1,658.15 (2.37 శాతం) పాయింట్లు, నిఫ్టీ 487.25 (2.32 శాతం) పాయింట్లు పుంజుకున్నాయి.
బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్‌పై 76 డాలర్లకు పడిపోవడంతోపాటు సెప్టెంబర్ త్రైమాసికం జీడీపీ 7.6 శాతం ఉంటుందని, మాన్యు ఫాక్చరింగ్ పీఎంఐ 56కు పెరగడం, విదేశీ పోర్ట్ పోలియో ఇన్వెస్టర్లు స్టాక్స్ కొనుగోళ్లకు దిగడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త రికార్డులు నెలకొల్పాయని విశ్లేషకులు చెప్పారు. శుక్రవారం ట్రేడింగ్‌లో బీఎస్ఈలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఒక్కటే భారీగా 5.8 శాతం లబ్ధి పొందింది. తర్వాతీ జాబితాలో టీసీఎస్, ఇన్ఫోసిస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, ఎన్టీపీసీ, విప్రో లాభ పడ్డాయి. మరోవైపు నెస్ట్లే, భారతీ ఎయిర్టెల్, మారుతి సుజుకి, ఐటీసీ నష్టపోయాయి. బీఎస్ఈ స్మాల్ క్యాప్ 0.58 శాతం పుంజుకుంటే, మిడ్ క్యాప్ 0.07 శాతం నష్టంతో ముగిశాయి.
ఐటీ ఇండెక్స్ 4.41 శాతం, మెటల్ 1.78, ఆయిల్ అండ్ గ్యాస్ 1.43 శాతం, కమొడిటీస్ 1.38 శాతం, ఎనర్జీ 1.15 శాతం, బ్యాంకెక్స్ 0.79 శాతం లాభ పడితే, ఎఫ్ఎంసీజీ, ఆటో, రియాల్టీ, సర్వీస్ ఇండెక్స్ నష్టపోయాయి. ఆసియా మార్కెట్లలో సియోల్, టోక్యో, హాంకాంగ్ లాభాలతో ముగిస్తే షాంఘై నష్టంతో, ఈయూ మార్కెట్లు మిశ్రమ ఫలితాలతో ముగిశాయి. శుక్రవారం బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.76 లక్షల కోట్లు పెరుగగా, ఈ వారంలో రూ.8.55 లక్షల కోట్ల వృద్ధితో రూ.357.78 లక్షల కోట్లకు చేరుకున్నది.