న్యూఢిల్లీ, డిసెంబర్ 31: మదుపరుల పంట పండింది. 2024లో దేశీయ ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారి సంపద రూ.77.66 లక్షల కోట్ల మేర పెరిగింది. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ దేశీయంగా అన్ని అనుకూల పవనాలు వీయడంతో మదుపరులు భారీ లాభాలను ఆర్జించారు.
సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడంతోపాటు పలు రాష్ర్టాల్లో బీజేపీ జెండా ఎగురవేయడంతో సూచీలు కదంతొక్కాయి. దీంతో ఈ ఏడాది బీఎస్ఈ సెన్సెక్స్ ఎనిమిది శాతం మేర లాభపడింది. బుల్స్, బేర్స్ మధ్య జరిగిన యుద్ధంలో బుల్స్ విజయకేతనం ఎగురవేసింది. గడిచిన 12 నెలల్లో నాలుగు నెలలు స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోగా మిగతా ఎనిమిది నెలల్లో రికార్డు స్థాయికి ఎగబాకాయి.
2024లో సెన్సెక్స్ 5,898.75 పాయింట్లు లేదా 8.16 శాతం, నిఫ్టీ 1,913.4 పాయింట్లు లేదా 8.80 శాతం చొప్పున పెరిగాయి. దీంతో బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల మార్కెట్ విలువ రూ.77,66,260.19 కోట్లు పెరిగి రూ.4,41,95,106.44 కోట్లు(5.16 ట్రిలియన్ డాలర్లు)కు చేరుకున్నది. ఈ ఏడాది ఏప్రిల్ 8న తొలిసారిగా బీఎస్ఈలో లిైస్టెన సంస్థల విలువ రూ.400 లక్షల కోట్లు దాటింది. క్రితం ఏడాది జూలైలో రూ.300 లక్షల కోట్లు అధిగమించింది.