Stock Markets- Investers Wealth | ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత ధోరణులు కొనసాగినా, బుల్స్, బేర్స్ మధ్య టగ్ ఆఫ్ వార్ కొనసాగినా దేశీయ స్టాక్ మార్కెట్లు పాజిటివ్ ఫలితాలతోనే 2024కు గుడ్ బై చెప్పాయి. బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ ఎనిమిది శాతం వృద్ధి చెందింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై ఒత్తిళ్లు కొనసాగినా భారతీయ స్టాక్ మార్కెట్లు నికరంగా కొనసాగుతూ ఇన్వెస్టర్లకు స్ఫూర్తిదాయక రిటర్న్స్ అందించాయి. 2024లో ఇన్వెస్టర్ల సంపదగా భావిస్తున్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.77.66 లక్షల కోట్లు పెరిగింది. 2024 సవాళ్లతో కొనసాగినా ఒక రివార్డు మిగిల్చింది. ఎన్ఎస్ఈ-50 సూచీ నిఫ్టీ జనవరి నుంచి సెప్టెంబర్ వరకూ నికరంగా పెరుగుతూ 26,277.35 పాయింట్ల జీవిత కాల గరిష్టాన్ని తాకింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు వాటాలను విక్రయించినా వరుసగా ఎన్ఎస్ఈ నిఫ్టీ తొమ్మిదో ఏటా పాజిటివ్ రిటర్న్స్ తో ముగిసింది.
మరోవైపు, బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ 5,898.75 (8.16 శాతం) పాయింట్లు పుంజుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 27న బీఎస్ఈ సెన్సెక్స్ 85,978.25 పాయింట్ల జీవిత కాల గరిష్టానికి దూసుకెళ్లింది. ఈక్విటీ మార్కెట్లలో ఓవరాల్గా ఆశావాహ దృక్పథం నెలకొనడంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.77,66,260.19 కోట్లు పెరిగి రూ.4,41,95,106.44 కోట్ల (5.16 లక్షల కోట్ల డాలర్లు)కు చేరింది. ఏప్రిల్ ఎనిమిదో తేదీన బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.400 లక్షల కోట్ల మైలురాయిని దాటింది. గతేడాది జూలైలో రూ.300 లక్షల కోట్ల మైలురాయిని దాటిందీ బీఎస్ఈ.
ఏప్రిల్- జూన్ మధ్య సాగిన సార్వత్రిక ఎన్నికల సంరంభంలో బీజేపీ మూడోసారి గెలుస్తుందన్న అంచనాల మధ్య స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత మెజారిటీ కొద్ది దూరంలో బీజేపీ నిలిచినా ఎన్డీఏ పక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ. దీంతో స్టాక్ మార్కెట్లు స్వల్ప సర్దుబాట్లకు గురైనా తిరిగి పుంజుకున్నాయి. యూఎస్ ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీరేట్లు తగ్గిస్తుందన్న అంచనాల మధ్య అక్టోబర్ నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లలో ప్రతికూల ధోరణి నెలకొంది. అక్టోబర్ నెలలోనే బీఎస్ఈ సెన్సెక్స్ 4910.72 పాయింట్లు పతనమైంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు అక్టోబర్ నెలలో రికార్డు స్థాయిలో రూ.94,017 కోట్ల నిధులు ఉపసంహరించారు.
జనవరి, మే, అక్టోబర్, నెలలు మినహాఎనిమిది నెలల్లో సెన్సెక్స్ ఇన్వెస్టర్లకు లాభాలు పండించింది. 2024లో చివరి రోజు మంగళవారం (డిసెంబర్ 31)న ట్రేడింగ్ ముగిసిన తర్వాత బ్లూ చిప్ కంపెనీల్లో రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.16,44,792.26 కోట్లుగా నిలిచింది. తర్వాతీ స్థానాల్లో టీసీఎస్ రూ.14,82,402.82 కోట్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.13,55,520.10 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంకు రూ.9,04,975.61 కోట్లు, బారతీ ఎయిర్ టెల్ రూ.9,04,583.72 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ గా నమోదైంది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.81.90 లక్షల కోట్లు పెరిగితే, ఇన్వెస్టర్లు రూ.16.38 లక్షల కోట్లకు పైగా సంపన్నులయ్యారు.