మార్కెట్ పల్స్
రూపాయి పతనం, ఫెడ్, ఆర్బీఐ వడ్డీరేట్లు పెంచుతాయన్న సంకేతాలు, ఫారెక్స్ నిల్వల తగ్గుదల తదితర ప్రతికూల వార్తలు వెలువడుతున్నప్పటికీ, గతవారం ఐదు ట్రేడింగ్ రోజుల్లోనూ స్టాక్స్ ర్యాలీ జరిపాయి. నిఫ్టీ 670 పాయింట్ల లాభంతో 16,719 పాయింట్ల వద్ద నిలిచింది. కొద్ది నెలలుగా విక్రయాలు జరుపుతున్న విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు క్రితంవారంలో తిరిగి కొనుగోళ్లకు ఉపక్రమించడం, డెరివేటివ్స్ విభాగంలో షార్ట్ కవరింగ్ జరపడం ర్యాలీకి కారణమని విశ్లేషకులు చెప్తున్నారు. ప్రధాన మూవింగ్ ఏవరేజ్లన్నీ పైస్థాయికి చేరినందున, వచ్చే కొద్దిరోజుల్లో ట్రెండ్ సానుకూలంగా ఉంటుందని అంచనా. అయితే ఈ వారం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ముగింపు, 26, 27 తేదీల్లో ఫెడ్ సమావేశం వంటి అంశాల నేపథ్యంలో స్వల్ప ఒడిదుడుకులు ఎదురు కావచ్చని హెచ్చరిస్తున్నారు.
తొలి నిరోధం 16,850
ఈ వారం నిఫ్టీ తొలుత 16,850 పాయింట్ల సమీపంలో నిరోధాన్ని చవిచూడవచ్చన్నది సాంకేతిక విశ్లేషకుల అంచనా. డెయిలీ, వీక్లీ చార్టుల్లో బుల్లిష్ క్యాండిల్ ఏర్పడినందున, సూచీ మరింత పెరుగుతుందని, 16,850 నిరోధస్థాయిని దాటితే 17,000 స్థాయిని సైతం అందుకోవచ్చని ఈక్విటీ రిసెర్చ్ వ్యవస్థాపకుడు మిలన్ వైష్ణవ్ తెలిపారు. 16,550, 16,435 పాయింట్ల వద్ద మద్దతు లభిస్తున్నదన్నారు. సూచీకి తక్షణం 16,800 వద్ద అవరోధం ఎదురవుతుందని, 16,490-16,360 మధ్య మద్దతు ఉన్నదని ఏంజిల్ ఒన్ అనలిస్ట్ ఓషో కిషన్ తెలిపారు. కొటక్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ అమోల్ అథేవాలా దాదాపు ఇవే అంచనాల్ని ప్రకటిస్తూ 16,800 నిరోధాన్ని దాటితే 16,950కి చేరవచ్చన్నారు.