Stocks | ఐటీ స్టాక్స్ దన్నుతో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం రికార్డు గరిష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ ఇంట్రాడే ట్రేడింగ్ లో దాదాపు 1000 పాయింట్లు పుంజుకుని 80,893.5 పాయింట్లకు చేరుకుంటే, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 24,592 పాయింట్లకు దూసుకెళ్లింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 622 పాయింట్ల లబ్ధితో 80,519 పాయింట్ల వద్ద స్థిర పడితే, ఎన్ఎస్ఈ నిఫ్టీ 196 పాయింట్ల లాభంతో 24,502 పాయింట్ల వద్ద ముగిసింది.
అంచనాలను బ్రేక్ చేస్తూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో టీసీఎస్ షేర్ దాదాపు ఏడు శాతం పుంజుకున్నది. తద్వారా ఐటీ రంగం పూర్వ వైభవం సంతరించుకుంటుందన్న సంకేతాలనిచ్చింది. ఇన్పోసిస్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్ 3.4 శాతం లాభాలతో ముగిశాయి. యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, జేఎస్ డబ్ల్యూ స్టీల్, బజాజ్ ట్విన్స్ 1.4 శాతం లాభంతో సెంటిమెంట్ ను బలోపేతం చేశాయి. బీఎస్ఈలో యాక్సిస్ బ్యాంక్ పుంజుకుంటే మారుతి సుజుకి, ఏషియన్ పెయింట్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టైటాన్ షేర్లు పతనం అయ్యాయి.
అటు బీఎస్ఈ సెన్సెక్స్, ఇటు ఎన్ఎస్ఈ నిఫ్టీ కొత్త బెంచ్ మార్కులు నెలకొల్పినా బీఎస్ఈ మిడ్ క్యాప్ 0.22, బీఎస్ఈ స్మాల్ క్యాప్ 0.13 శాతం పతనం అయ్యాయి. మరోవైపు నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 4.5 శాతం లాభ పడితే, నిఫ్టీ మీడియా రెండు శాతం పుంజుకున్నది. నిఫ్టీ రియాల్టీ 1.5 శాతం నష్టంతో ముగిసింది. ఆయిల్ ఇండియా గత రెండు రోజులుగా 17 శాతం లాభ పడింది. దీంతో ఆయిల్ ఇండియా మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.లక్ష కోట్లకు చేరువలో ఉంది. ఫారెక్స్ మార్కెట్లో యూఎస్ డాలర్ మీద రూపాయి మారకం విలువ 83.536 వద్ద స్థిర పడింది. బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 86.10 డాలర్ల వద్ద తచ్చాడుతున్నది.