Stock Market | భారత స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో సెషనల్లో లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 76వేలు, నిఫ్టీ 23వేల పాయింట్ల ఎగువ ముగిసింది. గ్లోబల్ మార్కెట్లలో మిశ్రమ ఫలితాల మధ్య లాభాల్లో మొదలైన మార్కెట్లు చివరి వరకు అదే జోరును కొనసాగించాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, జొమోటో షేర్లలో కొనుగోళ్ల మద్దతు కనిపించింది. ఫిబ్రవరి 1న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ సారి బడ్జెట్లో పన్ను మినహాయింపులు ప్రకటించనున్నారని భావిస్తున్నారు. అలాగే, ఆర్బీఐ సైతం వడ్డీ రేట్లను తగ్గించనున్నదనే అంచనాల నేపథ్యంలో మార్కెట్లు లాభాల్లో కొనసాగాయి. కిత్రం సెషన్‌తో పోలిస్తే 76,138.24 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైన సెన్సెక్స్.. ఇంట్రాడేలో 75,975.80 పాయింట్ల కనిష్ఠానికి చేరుకుంది.
గరిష్ఠంగా 76,599.73 పాయింట్లను తాకింది. చివరకు 631.5 పాయింట్ల లాభంతో 76,532.96 వద్ద ముగిసింది. నిఫ్టీ 205.85 పాయింట్లు పెరిగి 23,163.10 వద్ద స్థిరపడింది. దాదాపు 2,874 షేర్లు పురోగమించగా.. మరో 937 షేర్లు పతనమయ్యాయి. మీడియా, క్యాపిటల్ గూడ్స్, ఐటీ, మెటల్, రియల్టీ రెండు నుంచి మూడుశాతం.. ఆటో, బ్యాంక్, ఫార్మా, ఆయిల్, గ్యాస్ 0.5 నుంచి 1.5 శాతం మధ్య లాభపడ్డాయి. ఎఫ్ఎంసీజీ సూచీ 0.5 శాతం పతనమైంది. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 2.5 శాతం, స్మాల్ క్యాప్ సూచీలు 3.2 శాతం పెరిగాయి. నిఫ్టీలో శ్రీరామ్ ఫైనాన్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, విప్రో, టాటా మోటార్స్, ఎస్బీఐ లైఫ్ అత్యధికంగా లాభపడగా.. ఏషియన్ పెయింట్స్, మారుతీ సుజుకీ, బీపీసీఎల్, బ్రిటానియా ఇండస్ట్రీస్, ఐటీసీ నష్టపోయాయి.