Nitin Gadkari | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: విద్యుత్‌తో నడిచే వాహన తయారీ సంస్థలకు రాయితీలు ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టంచేశారు. ప్రస్తుతం కొనుగోలుదారులు సొంతంగా ఈవీలు లేదా సీఎన్జీ వాహనాలను ఎంచుకునే స్థాయికి చేరుకున్నారని బీఎన్ఈఎఫ్ సమ్మిట్‌లో చెప్పారు.
ప్రారంభంలో ఈవీల తయారీదారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా రాయితీలు ప్రకటించినట్లు, ఆ తర్వాతి క్రమంలో వీటికి డిమాండ్ ఊపందుకున్నదని, దీంతో ఉత్పత్తిపై పెట్టే ఖర్చులు తగ్గుముఖం పట్టడంతో సంస్థలకు ఇచ్చే రాయితీలు అనవసరమని మంత్రి వ్యాఖ్యానించారు.
పెట్రోల్, డీజిల్ వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాలపై విధిస్తున్న జీఎస్టీ తక్కువ స్థాయిలో ఉన్నదన్నారు. హైబ్రిడ్స్ వాహనాలతోపాటు పెట్రోల్, డీజిల్ వాహనాలపై 28 శాతం జీఎస్టీని వసూలు చేస్తుండగా, అదే ఎలక్ట్రిక్ వాహనాలపై 5 శాతం విధిస్తున్నారు.