న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో ట్రావెల్, టూరిజం రంగాలు కోలుకుంటున్నాయి. మహమ్మారితో కుదేలైన ఆతిథ్య రంగం కూడా కోలుకోవడంతో ఆయా రంగాల్లో నియామకాలు ఊపందుకుంటున్నాయి. తాజాగా క్లియర్‌ట్రిప్, మేక్మైట్రిప్,ఈజ్‌మైట్రిప్ వంటి కంపెనీలు నియామకాలపై దృష్టిసారించాయి. లీజర్, బిజినెస్ ట్రావెల్ గత కొన్ని వారాలుగా పుంజుకోవడంతో తాజా హైరింగ్‌కు సన్నద్ధమయ్యాయి.
కరోనా మహమ్మారి తీవ్రతతో ట్రావెల్, టూరిజం పరిశ్రమ గత 15 నెలల్లో లక్షలాది ఉద్యోగాలను కోల్పోవడంతో పాటు కోట్లాది రూపాయల రాబడిని కోల్పోయింది. తొలి వేవ్ తర్వాత సెకండ్ వేవ్ విరుచుకుపడటం మెల్లిగా దాని ప్రభావం తగ్గడంతో ఈ రంగాలు జవసత్వాలు కూడదీసుకున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకోవడంతో కూడా ప్రయాణాలు మళ్లీ గాడినపడుతున్నాయి. మహమ్మారితో ప్రయాణాలు వాయిదా వేసుకున్న టూరిస్టులు సైతం తిరిగి తమ ఫేవరేట్ డెస్టినేషన్స్ బాటపడుతుండటంతో నిపుణుల కోసం ఆయా కంపెనీలు సిబ్బంది నియామకంపై దృష్టిసారించాయి.
తాము 200కు పైగా ఉద్యోగులను విధుల్లోకి తీసుకునేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నామని మేక్మైట్రిప్ ప్రతినిధి వెల్లడించారు. విమానాలు, హోటళ్లు, క్యాబ్‌లు, రైళ్లలో రద్దీ సాధారణ స్ధాయికి చేరడంతో వ్యాపార రికవరీతో కొలువులకు డిమాండ్ పెరిగిందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. ఇక 390 మంది ఉద్యోగులు కలిగిన ఈజ్‌మైట్రిప్ కంపెనీ వచ్చే ఏడాదిలోగా 50 శాతం సిబ్బంది సంఖ్యను పెంచాలని యోచిస్తోంది. క్లియర్‌ట్రిప్ సైతం పెద్ద సంఖ్యలో నియామకాలు చేపట్టనుండగా, ట్రావెల్, టూరిజం, ఆతిథ్య రంగాల్లోని పలు సంస్థలు డిమాండ్‌కు తగినంతగా సిబ్బంది సంఖ్యను పెంచేందుకు కసరత్తు సాగిస్తున్నాయి.