Make In India | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: ‘మేక్ ఇన్ ఇండియా’ అంటూ మోదీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తెచ్చిన కార్యక్రమం.. దేశీయ తయారీ రంగంలో ఏమాత్రం ఉత్సాహాన్ని నింపలేకపోయింది. 10 ఏండ్లపాటు ప్రచారం చేసినా.. ఫలితం శూన్యం. మోదీ హయాం కంటే జీడీపీలో తయారీ రంగం వాటా అంతకుముందే బాగుండటం గమనార్హం. 2014 మే నుంచి కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిగా ఉంటున్న విషయం తెలిసిందే. 2030 నాటికి దేశ జీడీపీలో తయారీ రంగం వాటాను 25 శాతానికి పెంచాలన్న లక్ష్యంతో ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు.
అయితే గత ఆర్థిక సంవత్సరం 2023-24లో ఇది 15.9 శాతంగానే ఉన్నది. కానీ 2013-14లో 16.7 శాతంగా ఉండటం విశేషం. దీంతో తమ ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం నెరవేరడానికి ఇంకా సమయం ఉందని, పడుతుందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన డీపీఐఐటీ కార్యదర్శి అమర్దీప్ సింగ్ భాటియా అంటున్నారు. పెట్టుబడులు, సాంకేతికత, నైపుణ్యాభివృద్ధి అంశాల్లో మరింత మెరుగైన ఫలితాల్ని సాధించాల్సి ఉందని ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ అభిప్రాయపడ్డారు. ఆ దిశగానే ప్రభుత్వం దృష్టి పెట్టిందని కూడా వివరించారు. పీఎం గతి శక్తి స్కీంతో రవాణా ఖర్చుల భారాన్ని పరిశ్రమపై తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు. అయితే గత ప్రభుత్వాలతో పోల్చితే నిధుల కేటాయింపులపరంగా, రాయితీలు-ప్రోత్సాహకాలపరంగా తయారీ రంగానికి పెద్దపీట వేస్తున్నట్టు ప్రకటించినా.. ఆచరణలో అది కనిపించట్లేదన్న విమర్శలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.