New Jobs | న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: దేశంలోని ఉద్యోగుల్లో చాలామంది ఇప్పుడున్న కంపెనీలను వీడే యోచనలో ఉన్నట్టు ఓ తాజా సర్వేలో తేలింది. వచ్చే ఏడాదికాలంలో కొత్త సంస్థల్లో చేరేందుకే మెజారిటీ వర్కర్లు ఆసక్తి చూపుతున్నారని ప్రముఖ గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ ఏవోఎన్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ ఏడాదికిగాను చేపట్టిన ఈ ఎంప్లాయీ సెంటిమెంట్ స్టడీలో పాల్గొన్నవారిలో 82 శాతం మంది ఇప్పుడున్న యాజమాన్యాన్ని వదిలి కొత్త యాజమాన్యం కిందకు వెళ్లాలనే భావిస్తున్నారని స్పష్టమైంది.
ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే ఇది 60 శాతంగా ఉన్నది. భారత్, అమెరికా, చైనా, బ్రిటన్, ఆస్ట్రేలియా తదితర 23 దేశాల్లో ఈ సర్వే జరిగింది. 9 వేలకుపైగా ఉద్యోగుల అభిప్రాయాలను తీసుకున్నారు. ఈ క్రమంలోనే భారత్లో ఎక్కువమంది ప్రస్తుత కంపెనీల్లో ఉద్యోగాలను మానేసి కొత్త కంపెనీల్లో వెతుక్కోవాలని ఆలోచిస్తున్నారు. ఇక 7 శాతం మంది తమకు తక్కువ వేతనాలు వస్తున్నట్టు ఆవేదన చెందుతున్నారు. ఇలా అనేక అసంతృప్తుల నడుమ జాబ్ చేంజ్కే అధికులు మొగ్గు చూపుతున్నట్టు సర్వే పేర్కొన్నది.
దేశీయ సేవల రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 63.03 శాతం మంది రూ.500 కోట్ల కంటే తక్కువ ఉత్పత్తిని చేస్తున్న కంపెనీల్లోనే ఉన్నట్టు బుధవారం విడుదలైన ప్రభుత్వ సర్వే తెలియజేసింది. పైలట్ ప్రాజెక్టు కింద తొలిసారి జరిగిన ఈ సర్వేలో రూ.500 కోట్ల కంటే ఎక్కువ ఉత్పత్తి చేస్తున్న కంపెనీలు ఉపాధినివ్వడం కన్నా ఆస్తుల్ని పెంచుకోవడంలోనే కీలకంగా ఉన్నాయని తేలింది. సేవా రంగ సంస్థల ఆస్తుల్లో 62.77 శాతం వాటా బడా సంస్థలకు చెందినవే మరి. సేవా రంగ సంస్థల వార్షిక సర్వే పేరిట కేంద్ర గణాంకాలు, కార్యాచరణ మంత్రిత్వ శాఖ ఈ అధ్యయనాన్ని చేసింది.