Women Savings | ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మహిళలు, బాలికలకు ఆర్థిక స్వాతంత్య్రం కోసం కేంద్రం సరికొత్త పొదుపు పథకం తీసుకొచ్చింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా మహిళా సమ్మాన సేవింగ్స్ సర్టిఫికెట్ పేరిట మహిళలు, బాలికలకు స్పెషల్‌గా కొత్త చిన్న మొత్తాల పథకాన్ని 2023-24 బడ్జెట్ ప్రసంగంలో విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభంతో శనివారం నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది. దేశంలోని 1.59 లక్షల పోస్టాఫీసుల్లోనూ ఈ పథకాన్ని మహిళలు, బాలికల కోసం అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపింది.
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్లను మహిళలు గానీ, బాలికల పేరుపై గానీ తీసుకునేందుకు వీలు ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రెండేండ్ల వరకు అంటే 2025 మార్చి వరకు ఈ పథకం అమల్లో ఉంటుంది. ఈ పథకంపై కేంద్ర ప్రభుత్వం 7.50 శాతం వడ్డీరేటు ఇస్తున్నట్లు తెలిపింది. గరిష్టంగా రూ.2 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. ఇప్పటికైతే ఈ పథకం పోస్టాఫీసులకే పరిమితం చేశారు. బ్యాంకుల్లో ఎప్పటి నుంచి అమలవుతుందో వెల్లడించలేదు.
మహిళలు, బాలికలు తమ సమీపంలోని పోస్టాఫీసుకు వెళ్లి మహిళా సమ్మాన బచత్ పత్ర యోజన ఫామ్ తీసుకోవాలి. పర్సనల్, ఆర్థికపరమైన, నామినీ తదితర వివరాలతో ఆ దరఖాస్తు ఫామ్ నింపాలి.
గుర్తింపు, చిరునామా ధృవీకరణ పత్రాలు అంటే ఆధార్, పాన్ జిరాక్స్ ప్రతులను దరఖాస్తు ఫామ్‌తోపాటు సమర్పించాలి. ఎంత డిపాజిట్ చేయ తలపెట్టారో నిర్ణయించుకున్న మొత్తం క్యాష్ రూపంలో గానీ, చెక్ రూపంలో గానీ డిపాజిట్ చేయాలి. పెట్టుబడి మదుపు చేసినందుకు రుజువుగా ఇచ్చే సర్టిఫికెట్‌ను తీసుకోవాలి.
ఈ పథకం కింద ట్రాన్సాక్షన్ చేసినందుకు రశీదు కావాలంటే రూ.40 చెల్లించాలి. డిజిటల్ మోడ్‌లో కావాలంటే రూ.9 చెల్లిస్తే సరిపోతుంది. సంవత్సరం తర్వాత నగదు పాక్షికంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. డిపాజిట్ మొత్తంలో 40 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు. గడువు తీరక ముందే ఖాతా క్లోజ్ చేయడానికి నిబంధనలు అనుమతించవు. ఒకవేళ ఖాతాదారు మరణించినా, తీవ్ర అనారోగ్యానికి గురైనా ముందస్తుగా అకౌంట్ రద్దు చేయొచ్చు. కానీ ఖాతా తెరిచిన ఆరు నెలల తర్వాతే అందుకు అనుమతి ఇస్తారు.