హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): భారత్ సహా ఇతర దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న భారీ సుంకాల మోతతో అమెరికాలోని భారతీయుల జేబులకు చిల్లులు పడుతున్నాయని బీఆర్ఎస్ ఎన్నారై సెల్ గ్లోబల్ కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల తెలిపారు. సుంకాల పెంపుతో ఒక్కో భారతీయ కుటుంబంపై నెలకు సగటున దాదాపు 1,000 డాలర్ల (రూ.88 వేల) వరకు భారం పడుతున్నదని ఆయన వెల్లడించారు.
అమెరికాలో ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత సుంకాలను పెంచడంతో ధరలు రెట్టింపయ్యాయి. ఇవి స్థానిక వినియోగదారులతోపాటు భారతీయులకు పెను భారంగా మారాయి. ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు దాదాపు 50% వరకు పెరగడంతో ఆయా కుటుంబాల పొదుపు (సేవింగ్స్)పై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు.
మరోవైపు, అమెరికాలో ఉద్యోగ అవకాశాలు కూడా భారీగా తగ్గాయని, హెచ్-1బీ వీసా ఫీజు లక్ష డాలర్లకు పెంచడంతో ఐటీ ఉద్యోగులు ఉపాధి అవకాశాలు కోల్పోతున్నట్టు చెప్పారు. దీంతో ప్రస్తుతం ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని, ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో..ఊడుతుందో తెలియని పరిస్థితుల్లో భారతీయులు నెట్టుకొస్తున్నట్టు వాపోయారు.