Market Capitalisation | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో ఐదు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.85,582.21 కోట్లు వృద్ధి చెందింది. గతవారమంతా ఈక్విటీ మార్కెట్లలో పాజిటివ్ ధోరణి నేపథ్యంలో భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) భారీగా లబ్ధి పొందింది. గతవారం బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 299.41 పాయింట్లు (0.39 శాతం) వృద్ధితో శుక్రవారం సెన్సెక్స్ జీవిత కాల గరిష్ట స్థాయి 77,145.46 పాయింట్ల వద్ద స్థిర పడింది.
ఎల్ఐసీతోపాటు రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) భారీగా లబ్ధి పొందాయి. మరోవైపు టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఐసీఐసీఐ బ్యాంకు, ఇన్ఫోసిస్, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్), ఐటీసీ కలిసి రూ84,704.81 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయాయి.
ఎల్ఐసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.45,425.48 కోట్లు పుంజుకుని రూ.6,74,877.25 కోట్ల వద్ద స్థిర పడింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఎం-క్యాప్ రూ.18,639.61 కోట్లు పెరిగి రూ.12,14,965.13 కోట్ల వద్ద ముగిసింది. రిలయన్స్ ఎం-క్యాప్ రూ.10,216.41 కోట్ల లాభంతో రూ.19,98,957.88 కోట్ల వద్ద నిలిచింది. ఎస్బీఐ ఎం-క్యాప్ రూ.9,192.35 కోట్ల వృద్ధితో రూ.7,49,845.89 కోట్లకు చేరుకున్నది. భారతీ ఎయిర్ టెల్ ఎం-క్యాప్ రూ.1,108.36 కోట్ల లబ్ధితో రూ.8,11,524.37 కోట్ల వద్ద ముగిసింది.
మరోవైపు, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.22,885.02 కోట్ల నష్టంతో రూ.5,82,522.41 కోట్ల వద్ద నిలిచింది. టీసీఎస్ ఎం-క్యాప్ రూ.22,052.24 కోట్లు కోల్పోయి రూ.13,86,433.06 కోట్లకు చేరుకున్నది. ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.9,986.78 కోట్ల పతనంతో రూ.6,18,030.37 కోట్ల వద్ద నిలిచింది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.11,179.27 కోట్ల నష్టంతో రూ.7,77,795.90 కోట్ల వద్ద స్థిర పడింది. ఐటీసీ ఎం-క్యాప్ రూ.9,987.78 కోట్లు కోల్పోయి రూ.5,38,216.34 కోట్లకు చేరుకున్నది.
గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత రిలయన్స్ మొదటి స్థానంలో కొనసాగుతున్నది. తర్వాతీ స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, భారతీ ఎయిర్ టెల్, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్బీఐ, ఎల్ఐసీ, ఇన్ఫోసిస్, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్), ఐటీసీ నిలిచాయి.