Luxury Cars | కరోనా మహమ్మారి తర్వాత ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. అందునా స్పేసియస్‌గా ఉండే ఎస్ యూవీ కార్లతోపాటు లగ్జరీ కార్ల పైనా మోజు పారేసుకుంటున్నారు. 2024లో ప్రతి గంటకు ఆరు రూ.50 లక్షలపై చిలుకు ధర గల లగ్జరీ కార్లు కొనుగోలు చేశారు. ఐదేండ్ల క్రితం గంటకు రెండు లగ్జరీ కార్లు మాత్రమే అమ్ముడయ్యేవి. సంపన్న వినియోగదారుల పునాది క్రమంగా పెరుగుతుండటంతో ప్రీమియం కార్లకు గిరాకీ పెరుగుతోంది. లగ్జరీ కార్లకు పెరుగుతున్న డిమాండ్‌ను గమనించిన కార్ల తయారీ సంస్థలు 2025లో రెండు డజన్లకు పైగా కొత్త మోడల్ కార్లను ఆవిష్కరించేందుకు సిద్ధం చేసుకుంటున్నాయి. బేస్ పెరుగుతున్నా కొద్దీ.. 50 వేల కార్లు అమ్ముడవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
లగ్జరీ కార్లలో ఒకటైన ఆడీ ఇండియా అధిపతి బల్బీర్ సింగ్ ధిల్లాన్ మాట్లాడుతూ కరోనా తర్వాత ప్రీమియం కార్లకు గిరాకీ పెరిగిందన్నారు. 2025లో లగ్జరీ కార్ల మార్కెట్ 8-10 శాతం పెరుగుతుందని అంచనా వేశారు. మెర్సిడెజ్ బెంజ్ ఇండియా ఎండీ కం సీఈఓ సంతోష్ అయ్యర్ మాట్లాడుతూ స్థిరమైన ఆర్థిక ఫలితాలతోపాటు వినియోగదారుల సానుకూల సెంటిమెంట్ వల్ల లగ్జరీ కార్ల మార్కెట్ పెరుగుతుందన్నారు.
దేశీయంగా లగ్జరీ కార్ల విక్రయాల్లో మెర్సిడెజ్-బెంజ్ ముందు వరుసలో నిలిచింది. 2024లో దాదాపు 20 వేల యూనిట్ల కార్లు అమ్ముడవుతాయని కంపెనీ యాజమాన్యం భావిస్తున్నది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 13 శాతం వృద్ధిరేటు ఉంటుందని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో 14,379 యూనిట్లు అమ్ముడయ్యాయి. పెరుగుతున్న గిరాకికి అనుగుణంగా 2025లో కొత్త కార్ల ఆవిష్కరణతోపాటు మార్కెట్ విస్తరణకు ప్రణాళిక సిద్ధం చేసింది.
బీఎండబ్ల్యూ ఇండియా సైతం ఐదు శాతం సేల్స్ పెంచుకున్నది. 2024 జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య 10,556 కార్లు విక్రయించింది. ఆడి ఇండియా సేల్స్ 16 శాతం తగ్గాయి. సప్లయ్ చైన్‌లో ఇబ్బందుల వల్లే ఈ పరిస్థితి నెలకొందని, 2025లో రికవరీకి కొత్త ఉత్పత్తులను ఆవిష్కరిస్తామని ఆడి ఇండియా చెబుతోంది. గతేడాదితో పోలిస్తే లగ్జరీ కార్ల విక్రయాలు పెరిగినా.. మొత్తం కార్ల విక్రయాల్లో వీటి వాటా ఒక శాతం పై చిలుకే. ప్రధాన గ్లోబల్ ఎకానమీల్లో భారత్‌లో లగ్జరీ కార్ల విక్రయాలు తక్కువ.
నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ -2024 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా భారత్‌లోనే అత్యధిక నికర సంపద పెంచుకున్న బిలియనీర్ల సంఖ్య పెరుగుతోంది. 2023లో భారత బిలియనీర్ల సంఖ్య 13,263 నుంచి 2024లో 50 శాతం పెరిగి 19,908లకు చేరుకుంది. చైనా, తుర్కియే, మలేషియాలను కూడా భారత్ దాటేసింది. సంపన్న వర్గం పెరిగినా కొద్దీ లగ్జరీ కార్లకు గిరాకీ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. 2020లో 20,500 లగ్జరీ కార్లు అమ్ముడైతే, 2021లో 28,600, 2022లో 38 వేలు, 2023లో 48 వేల లగ్జరీ కార్లు అమ్ముడయ్యాయి. 2024లో 50 వేల కార్లు అమ్ముడవుతాయని నిర్ధారించగా, వచ్చే ఏడాది 53,000-54,000 కార్ల అమ్మకాలకు అవకాశం ఉందని తెలుస్తున్నది.