Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాలతో ముగిశాయి. శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఆర్థిక సంవత్సరా (2025-26) నికి ప్రవేశ పెట్టనున్న వార్షిక బడ్జెట్ సానుకూలంగా ఉంటుందన్న అంచనాల మధ్య శుక్రవారం ఎల్ అండ్ టీ, ఐటీ స్టాక్స్ మద్దతుతో పుంజుకున్నాయి.
వచ్చే ఆర్థిక సంవత్సరం వృద్ధిరేటు 6.3-6.8 శాతం మధ్య ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం సమర్పించిన ఆర్థిక సర్వే కూడా దేశీయ స్టాక్ మార్కెట్లకు ఊతమిచ్చింది. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 740.76 పాయింట్లు లబ్ధి పొందితే, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 258.90 పాయింట్లు పుంజుకుని 23,500 పాయింట్ల ఎగువన 23,508.40 పాయింట్ల వద్ద స్థిర పడింది. నెస్లే ఇండియా, ఇండస్ ఇండ్ బ్యాంక్ నాలుగు శాతం చొప్పున లాభ పడ్డాయి.
అంతర్గత ట్రేడింగ్‌లో బీఎస్ఈ సెన్సెక్స్ 790.11 పాయింట్ల లబ్ధితో 77,549.92 పాయింట్ల గరిష్టానికి దూసుకెళ్లింది. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 281.2 పాయింట్ల వృద్ధితో 23,530.70 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. బీఎస్ఈ -30 సెన్సెక్స్‌లో టైటాన్, ఇండస్ ఇండ్ బ్యాంక్, మారుతి, ఐటీసీ భారీగా లబ్ధి పొందగా, ఐటీసీ హోటల్స్, బజాజ్ ఫిన్ సర్వ్, భారతీ ఎయిర్ టెల్, ఐసీఐసీఐ బ్యాంకు నస్టపోయాయి.
ఆసియా మార్కెట్లలో టోక్యో మార్కెట్ పాజిటివ్‌గా ముగిసింది. సియోల్ నష్టపోగా, షాంఘై, హాంకాంగ్ స్టాక్ మార్కెట్లకు శుక్రవారం సెలవు. అమెరికా మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. గురువారం భారత్ ఈక్విటీ మార్కెట్లలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.4,582.95 కోట్ల విలువైన వాటాలు కొనుగోలు చేశారు. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 0.13 శాతం పుంజుకుని 76.97 డాలర్లు పలుకుతోంది.