Gautham Adani | బిలియనీర్ గౌతం అదానీతో క్యాబ్ డెలివరీ అగ్రిగేటర్ ఉబెర్ సీఈఓ దారా ఖోస్రోషాహి శనివారం సమావేశం అయ్యారు. ప్రస్తుతం భారత్లో పర్యటిస్తున్న దారా ఖోస్రోషాహి.. గౌతం అదానీతో చర్చించుకున్నారు. తాము ఇద్దరం కలిసి భారత్ గ్రోత్ విషయమై చర్చించుకున్నామని ‘ఎక్స్ (మాజీ ట్విట్టర్)’ వేదికగా తెలిపారు. మున్ముందు కలిసి పని చేయడానికి వీరిద్దరు సమావేశమై ఉంటారని చెబుతున్నారు.
‘భారత్లో ఉబెర్ విస్తరణకు దారా ఖోస్రోషాహి చేసిన కృషి, డ్రైవర్ల గౌరవం పెంచడంలో ఆయన నిబద్ధత స్ఫూర్తిదాయకం. మున్ముందు ఆయనతో కలిసి పని చేసేందుకు ఆసక్తితో ఉన్నాం’ అని గౌతం అదానీ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. దారా ఖోస్రోషాహి స్పందిస్తూ ‘గౌతం అదానీతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేస్తూ అద్భుతమైన సంభాషణ జరిపాం. భారత్ గ్రోత్ విషయమై చర్చించాం’ అని ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు. భారతదేశంలో వ్యాపారం మరింత విస్తరించడానికి, ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి మారేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.