CIBIL Score | కొత్తగా క్రెడిట్ కార్డు తీసుకోవాలన్నా.. కుటుంబ అవసరాలకు ఏదైనా లోన్ పొందాలన్నా సదరు వ్యక్తి క్రెడిట్ (సిబిల్) స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. సిబిల్ స్కోర్ 700 పాయింట్లకు పైగా ఉంటే ఆ వ్యక్తి ఆర్థిక క్రమశిక్షణ మెరుగ్గా ఉంటుందని పరిగణిస్తారు. సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉన్నప్పుడు సంబంధిత వ్యక్తుల రుణ దరఖాస్తులు అప్రూవ్ అవుతాయి. మీరు రుణం కోసం దరఖాస్తు చేసినప్పుడు అత్యధిక బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ) మీ క్రెడిట్ స్కోర్ తెలుసుకుంటాయి. సిబిల్ స్కోర్ చాలా తక్కువగా ఉంటే రుణ దరఖాస్తు క్యాన్సిల్ అవుతుంది. కానీ, తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నప్పుడు అత్యవసరంగా రుణం అవసరం అయితే మీరు రుణం పొందడం ఎలా అన్న సమస్య ఉత్పన్నం అవుతుంది. అయితే, తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నా రుణం పొందడానికి మార్గాలు ఉన్నాయి.
తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నవారు రుణాల కోసం ఎన్బీఎఫ్సీలను గానీ, ఫిన్‌టెక్ లెండర్లను గానీ ఆశ్రయించాలి. తక్కువ సిబిల్ స్కోర్ ఉన్న వారికి అప్పు ఇచ్చే ఎన్బీఎఫ్సీలు, ఫిన్‌టెక్ సంస్థలు ఉన్నాయి. అయితే, బ్యాంకులు వడ్డించే వడ్డీ కంటే ఎక్కువ వడ్డీరేటు వసూలు చేస్తాయి. ఏదైనా బ్యాంకులో రుణ దరఖాస్తు తిరస్కరణకు గురైనా మీ సిబిల్ స్కోర్ మరింత తగ్గుతుందన్న సంగతి మరిచిపోవద్దు.
మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే, అత్యవసర రుణం అవసరమైతే.. కో-అప్లికెంట్ (సహా-దరఖాస్తుదారు)తో కలిసి రుణం కోసం దరఖాస్తు చేయాలి. సదరు సహ-దరఖాస్తుదారు మీ కుటుంబ సభ్యులై ఉండటంతోపాటు మంచి క్రెడిట్ హిస్టరీ, సంపాదన పరులై ఉండాలి. కో-అప్లికెంట్ ఉంటే.. రుణ దాత (బ్యాంకర్)కు క్రెడిట్ రిస్క్ తగ్గుతుంది. రుణం చెల్లింపునకు కో-అప్లికెంట్కు కూడా సమాన బాధ్యత ఉంటుంది.
తక్కువ క్రెడిట్ (సిబిల్) స్కోర్ ఉన్నట్లయితే చిన్నమొత్తంలో రుణం కోసం దరఖాస్తు చేయాలి. చిన్నపాటి మొత్తం రుణం తీసుకుంటే దాని చెల్లింపు తేలికవ్వడంతోపాటు సిబిల్ స్కోర్ బలోపేతం అవుతుంది. ఒకసారి మీ సిబిల్ స్కోర్ పెరిగితే ఏదేనీ బ్యాంకు నుంచి పెద్దమొత్తంలో రుణం తీసుకోవచ్చు. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నా కొన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సెక్యూర్డ్ లోన్లు ఆఫర్ చేస్తున్నాయి. సెక్యూరిటీలు, ఆస్తులు, బంగారం తాకట్టుపై సెక్యూర్డ్ రుణాలిస్తాయి.