LIC | ముంబై, మార్చి 18: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ).. ఆరోగ్య బీమాలోకి ఈ నెలాఖరుకల్లా అడుగు పెడుతామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నది. వచ్చే రెండు వారాల్లో ఓ ఆరోగ్య బీమా కంపెనీలో వాటాను చేజిక్కించుకుంటామన్న ఆశాభావాన్ని మంగళవారం ఎల్ఐసీ ఎండీ, సీఈవో సిద్ధార్థ మహంతి వెలిబుచ్చారు. అయితే ఏ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో వాటాను కొనబోతున్నారో అనేది చెప్పని మహంతీ.. మార్చి 31లోగా కొంటామన్న నమ్మకాన్ని మాత్రం కనబర్చారు.
ఇక్కడ జరిగిన జీసీఏ25 కార్యక్రమానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఆరోగ్య బీమాలోకి ఎల్ఐసీ రావడం అనేది సహజం. ఈ అంశంపై తుది దశలో చర్చలున్నాయి’ అన్నారు. అయితే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో మెజారిటీ (51 శాతం) వాటా కొనబోమని, అయినప్పటికీ ఎంత? కొనాలన్నది కంపెనీ బోర్డు నిర్ణయిస్తుందన్నారు. కాగా, మణిపాల్సిగ్నాలో రూ.4,000 కోట్లతో వాటాను ఎల్ఐసీ కొనబోతున్నదన్న ప్రచారం జరుగుతున్నది.
దీర్ఘకాలిక ప్రభుత్వ బాండ్లను జారీ చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కు ఎల్ఐసీ విజ్ఞప్తి చేసింది. వందేండ్ల బాండైనాసరే తేవాలని మహంతి కోరారు. జీవిత పాలసీలను అమ్ముతున్నందున దీర్ఘకాలిక బాండ్లలో పెట్టుబడుల అవసరం ఉన్నదన్నారు. కాగా, 20-30 ఏండ్ల బాండ్లకు ఆర్బీఐ అనుమతినిస్తూ వస్తున్నది. ఈ క్రమంలో 40 ఏండ్ల బాండ్లకూ సుముఖత వ్యక్తం చేస్తున్నదన్న మహంతీ.. మున్ముందు 50 ఏండ్లు, 100 ఏండ్ల బాండ్లనైనా జారీ చేస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
ఇదే విషయమై ఆర్బీఐతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్టు మీడియాకు చెప్పారు. నిజానికి చాలా దేశాలు అంతర్జాతీయ మార్కెట్లో 100 ఏండ్ల బాండ్లను జారీ చేస్తున్నాయని గుర్తుచేశారు. అయితే భారత్ మాత్రం ఇప్పటికీ సదరు బాండ్ల జోలికి వెళ్లడం లేదని, దీనికి డిమాండ్ పరిమితంగా ఉండటం, సెకండరీ మార్కెట్లో తక్కువ కార్యకలాపాలే కారణం కావచ్చన్నారు.