ముంబై, జూన్ 25:దేశీయ బీమా దిగ్గజం ఎల్ఐసీ మరోసారి సత్తాచాటింది. అత్యంత విలువైన దేశీయ బ్రాండ్లలో ఎల్ఐసీకి నాలుగో స్థానం వరించింది. బ్రాండ్ ఫైనాన్స్ ఇండియా 100-2025 పేరుతో విడుదలైన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. గడిచిన ఏడాదికాలంలో ఎల్ఐసీ బ్రాండ్ విలువ 35 శాతం ఎగబాకి 13.6 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్టు తెలిపింది. 2024లో ఇది 10.07 బిలియన్ డాలర్లుగా ఉన్నది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత విలువైన బీమా సంస్థల్లో కూడా ఎల్ఐసీకి మూడో స్థానంలో నిలిచింది. టాప్-10లో చోటు దక్కించుకున్న సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్లో రూ.5.98 లక్షల కోట్లతో 8వ స్థానం లభించింది. క్రితం ఏడాదితో పోలిస్తే సంస్థ విలువ 38 శాతం ఎగబాకినట్టు వెల్లడించింది.
ఎంజీ కార్లు ప్రియం
న్యూఢిల్లీ, జూన్ 25: జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటర్ ఇండియా మరోసారి తన వాహన ధరలను పెంచబోతున్నట్టు ప్రకటించింది. వచ్చే నెల 1 నుంచి అమలులోకి వచ్చేలా అన్ని రకాల వాహన ధరలను 1.5 శాతం వరకు సవరిస్తున్నట్టు వెల్లడించింది. ఉత్పత్తి వ్యయం తోపాటు ఇతర స్థూల ఆర్థిక కారణాలతో ధరలను పెంచాల్సి వచ్చిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
కాల్‌మనీ మార్కెట్ సమయం పెంపు
ముంబై, జూన్ 25: కాల్‌మనీ మార్కెట్ సమయాన్ని వచ్చే నెల నుంచి మరో 2 గంటలు పొడిగిస్తున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బుధవారం తెలిపింది. జూలై 1 నుంచి ఉదయం 9 గంటల నుంచి సాయం త్రం 7 గంటలదాకా ఉంటుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం సాయంత్రం 5 గంటలకే ముగుస్తున్నది. మరోవైపు ఆగస్టు 1 నుంచి మార్కెట్ రెపో, ట్రై-పార్టీ రెపో (టీఆర్ఈపీ) ట్రేడింగ్ సమయాలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్ రెపో ట్రేడింగ్ మధ్యాహ్నం 2:30 గంటలదాకా, టీఆర్ఈపీ ట్రేడింగ్ 3 గంటల వరకు ఉంటున్నాయి.