న్యూఢిల్లీ, మే 27: దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) అంచనాలకుమించి రాణించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను సంస్థ రూ.19,013 కోట్ల నికర లాభాన్ని గడించింది. 2023-24 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.13,763 కోట్లతో పోలిస్తే 38 శాతం వృద్ధిని కనబరిచినట్టు పేర్కొంది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.2,50,923 కోట్ల నుంచి రూ.2,41,625 కోట్లకు తగ్గింది. దీంట్లో తొలి-ఏడాది ప్రీమియం వసూళ్లు రూ.13,810 కోట్ల నుంచి రూ.11,069 కోట్లకు తగ్గినట్టు బీఎస్ఈకి సమాచారం అందించింది.
అలాగే రెన్యూవబుల్ ప్రీమియం వసూళ్లు రూ.77,368 కోట్ల నుంచి రూ.79,138 కోట్లకు పెరిగాయి. మరోవైపు, గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.8,84,148 కోట్ల ఆదాయంపై రూ.48,151 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా మంగళవారం సమావేశమైన కంపెనీ బోర్డు..ప్రతి షేరుకు రూ.12 తుది డివిడెండ్‌ను అందిస్తున్నట్టు ప్రకటించింది. అలాగే పాలసీహోల్డర్లకు రూ.56,190 కోట్ల బోనస్ చెల్లింపులు జరపనున్నట్టు పేర్కొంది.
ఈ సందర్భంగా ఎల్ఐసీ ఎండీ, సీఈవో సిద్దార్థ మెహంతీ మాట్లాడుతూ.. గడిచిన ఆర్థిక సంవత్సరంలో సవాళ్లు ఉన్నప్పటికీ వృద్ధిని నమోదు చేసుకున్నట్టు, తొలి ఆరు నెలల్లో ఆశాజనక పనితీరు కనబరిచినట్టు చెప్పారు. పలు ఉత్పత్తులను మళ్లీ విడుదల చేయడం కలిసొచ్చిందన్నారు. హెల్త్‌కేర్ రంగంలోకి అడుగపెట్టడంలో భాగంగా వాటా కొనుగోలుపై ఆయన స్పందిస్తూ..ప్రస్తుతం ఇది చర్చల దశలో ఉన్నదని, వచ్చే రెండు నుంచి మూడు నెలల్లో బోర్డు నిర్ణయం తీసుకుంటుందన్నారు.