LIC | న్యూఢిల్లీ, నవంబర్ 8: దేశీయ బీమా దిగ్గజం ఎల్ఐసీ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.7,621 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2023-24 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.7,925 కోట్ల లాభంతో పోలిస్తే 3.8 శాతం తగ్గింది. ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయం తగ్గుముఖం పట్టడం వల్లనే లాభాల్లో గండిపడిందని పేర్కొంది.
గత త్రైమాసికంలో నికర ప్రీమియం ఆదాయం రూ.1,19,901 కోట్లు సమకూరింది. అంతక్రితం ఏడాది ఇది రూ.1,07,397 కోట్లుగా ఉన్నది. ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయం రూ.248 కోట్ల నుంచి రూ.145 కోట్లకు తగ్గడం వల్లనే ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపాయని ఎల్ఐసీ ఎండీ, సీఈవో సిద్ధార్థ మొహంతీ తెలిపారు.
అయినప్పటికీ కంపెనీ మొత్తం ఆదాయం రూ.2,01,587 కోట్ల నుంచి రూ.2,29,620 కోట్లకు పెరిగినట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. మరోవైపు నిర్వహణ ఖర్చులు కూడా రూ.1,94,335 కోట్ల నుంచి రూ.2,22,366 కోట్లకు పెరిగాయి. క్రితం ఏడాది 2.43 శాతంగా ఉన్న కంపెనీ స్థూల నిరర్థక ఆస్తుల విలువ గత త్రైమాసికానికిగాను 1.72 శాతానికి తగ్గాయని పేర్కొంది. అలాగే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో కంపెనీ రూ.2,33,671 కోట్ల ప్రీమియం వసూళ్లపై రూ.18,082 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.