LIC Q1 Results | ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి త్రైమాసికంలో భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) నికర లాభం పది శాతం వృద్ధి చెందింది. 2024-25 ఏప్రిల్ -జూన్ త్రైమాసికంలో ఎల్ఐసీ నికర లాభం రూ.10,461 కోట్లు సముపార్జించింది. 2023-24 తొలి త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.9,544 కోట్లు.
గత ఆర్థిక సంవత్సరం (2023-24) తొలి త్రైమాసికంలో రూ.1,88,749 కోట్ల ఆదాయం సంపాదించిన ఎల్ఐసీ.. ఈ ఏడాది రూ.2,10,910 కోట్లకు పెంచుకున్నట్లు గురువారం రెగ్యులేటరీ ఫైలింగ్ లో తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ‘ఫస్ట్ ఇయర్’ ప్రీమియం రూ.6,811 కోట్ల నుంచి రూ.7,470 కోట్లకు పెరిగింది. ప్రీమియంల రెన్యూవల్ ద్వారా వచ్చిన ఆదాయం రూ.53,638 కోట్ల నుంచి రూ.56,429 కోట్లకు వృద్ధి చెందింది.
పెట్టుబడుల ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రూ.96,183 కోట్ల నికర ఆదాయం గడించింది ఎల్ఐసీ. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.90,309 కోట్లు మాత్రమే. ఇక ఎల్ఐసీ సాల్వెన్సీ మార్జిన్లు 1.89 శాతం నుంచి 1.99 శాతానికి పెంచుకున్నట్లు తెలిపింది.