LIC Share Price | కేంద్ర ప్రభుత్వం, ఇన్వెస్టర్లు అన్ని వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఐపీవో ముహూర్తం దగ్గర పడుతున్నది. ఎల్ఐసీలో ప్రభుత్వం తన వాటా 3.5 శాతం విక్రయించడానికి సిద్ధమైంది. అంటే 22.12 కోట్ల షేర్లను విక్రయించనున్నది. అందులో 2.2 కోట్ల షేర్లు వాటాదారులకు, 0.15 కోట్ల షేర్లు ఉద్యోగులకు కేటాయిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి.
వచ్చేనెల 4-9 మధ్య నిర్వహించే ఐపీవోలో ఎల్ఐసీ షేర్ ధర రూ.902-949 మధ్య ఉంటుందని అంచనా. ఇందులో పాలసీదారులకు 60 రూపాయలు, ఉద్యోగులకు రూ.45 డిస్కౌంట్ ఉంటుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు మే రెండో తేదీన అనుమతి ఇస్తారు. ఇతర ఇన్వెస్టర్లు మే 4-9 మధ్య బిడ్ దాఖలు చేయొచ్చు.
ఎల్ఐసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 6 లక్షల కోట్లుగా అధికారులు నిర్ధారించారు. అందులో రూ.30 వేల కోట్ల విలువైన షేర్లు ఎల్ఐసీ విక్రయిస్తుందని తెలుస్తోంది. గత మార్చి నెలాఖరులోగా ఎల్ఐసీ ఐపీవోకు వెళ్లనున్నదని వార్తలు వచ్చినా.. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో జాప్యమైంది. ఎల్ఐసీ ఐపీవో కోసం దేశవ్యాప్తంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్, రాజ్‌కోట్, కోల్‌కతా తదితర నగరాల్లో సంస్థ మేనేజ్మెంట్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు రోడ్‌షోలు నిర్వహించారు.